బిజెపిని టార్గెట్ చేసి బిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం రూపొందించిన '100 అబద్దాల బిజెపి' సిడి, పుస్తకాని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. 

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బిఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ది, ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను ప్రచారం చేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పెట్టే వ్యూహాలతో ముందుకు వెళ్ళాలని బిఆర్ఎస్ భావిస్తున్నట్లుంది. ఇందులో భాగంగానే కేంద్రంలోని మోదీ సర్కార్ తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం 'బిజెపి 100 అబద్దాలు' పేరిట సిడిని, బుక్ లెట్ ను రూపొందించింది. దీన్ని ఇవాళ మంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. 

బిఆర్ఎస్ యువ నాయకులు పాటిమీది జగన్మోహన్ రావు, మన్నె క్రిశాంక్ తో పాటు మరికొందరు ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణతో పాటు దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం, ఏదో చేసినట్లు తప్పుడు ప్రచారం చేయడంపై రూపొందించిన సిడి, బుక్ లెట్ ను కేటీఆర్ కు అందించారు. 'బిజెపి 100 అబద్దాలు' పేరిట రూపొందించిన సిడి, బుక్ లెట్ ను కేటీఆర్ విడుదలచేసారు. 

వీడియో

ఉద్యోగాల భర్తీ, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీలు, తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడం... ఇలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఈ సిడి, బుక్ లెట్ ను రూపొందించింది బిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం. తెలంగాణ బిజెపి నాయకులను కూడా టార్గెట్ చేస్తూ సరికొత్త ప్రచారానికి సిద్దమయ్యింది బిఆర్ఎస్. ఇలా ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పెడుతూ బిఆర్ఎస్ బలోపేతానికి కృషిచేస్తున్న సోషల్ మీడియా విభాగాన్ని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.