ఏకంగా కేటీఆర్ కే షాకిచ్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే... కాంగ్రెస్ లో చేరికకిది సంకేతమా?
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు సొంత పార్టీ ఎమ్మెల్యేనే షాకిచ్చాడు. అధికారిక కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ లో పర్యటించిన కేటీఆర్ ను కలిసేందుకు స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఇష్టపడలేదు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార బిఆర్ఎస్ పార్టీ టికెట్ల ప్రకటనతో రాష్ట్రం ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయింది. ఓ పార్టీలోంచి మరోపార్టీలోకి జంపింగ్ లు పెరిగిపోయాయి. ఇలా ఇప్పటికే బిఆర్ఎస్ టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. ఇలా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కూడా బిఆర్ఎస్ ను వీడే ఆలోచనలో వున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ఇవాళ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ(సోమవారం) ఉప్పల్ లో పర్యటించారు. మూసీ నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన బ్రిడ్జిల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పాల్గొనలేదు. ఉప్పల్ బిఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి, మేయర్ విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారిక కార్యక్రమం కావడంతో ఎమ్మెల్యేకు ఆహ్వానం అందించినా ఆయన రాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చాడు కాబట్టే సుభాష్ రెడ్డి ఏకంగా కేటీఆర్ పాల్గొన్న కార్యక్రమానికే హాజరుకాలేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.
ఇక మంత్రి కేటీఆర్ కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమం నుండి అర్ధాంతకంగా వెళ్లిపోయారు. మూసీపై బ్రిడ్జి శంకుస్థాపన అనంతరం కేటీఆర్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొనాల్సి వుంది. కానీ ఆ మీటింగ్ కు హాజరుకాకుండానే మంత్రి వెనుదిరిగారు. స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో ఆగ్రహించిన కేటీఆర్ తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఉప్పల్ నుండి వెళ్లిపోయినట్లు స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు.
Read More బిఆర్ఎస్ అభ్యర్థులను మార్చాల్సిందే... వారికి టికెట్లు కేటాయించాలి..: విజయశాంతి
ఇక బిఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో వున్న భేతి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. కొందరు కాంగ్రెస్ నేతలతో కూడా ఆయన మంతనాలు జరిపినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. తగిన ప్రాధాన్యత దక్కని పార్టీలో వుండటంకంటే నియోజకవర్గంలో మంచి పట్టున్న కాంగ్రెస్ లో చేరడమే మంచిదని ఆయన అనుచరులు కూడా సూచిస్తున్నారట. దీంతో బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ చేరాలని సుభాష్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే భేతి సుభాష్ రెడ్డి బిఆర్ఎస్ కు రాజీనామా ప్రకటించి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.