బిఆర్ఎస్ అభ్యర్థులను మార్చాల్సిందే... వారికి టికెట్లు కేటాయించాలి..: విజయశాంతి
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు అవకాశం కల్పించే విషయంలో బిఆర్ఎస్ పార్టీ పునరాలోచన చేయాలని బిజెపి నాయకురాలు విజయశాంతి డిమాండ్ చేసారు.

హైదరాబాద్ : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా మహిళలకు రాజకీయ అవకాశాలు ఇవ్వాలన్న చిత్తశుద్ది బిజెపికి వుందికాబట్టే చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిందని... ఇక బిఆర్ఎస్ మహిళలకు టికెట్లు కేటాయించడంలో ఎలా స్పందిస్తుందో చూడాలన్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 115 మంది అభ్యర్థులను ప్రకటించిందని... అందులో కేవలం ఆరుగురే మహిళలు వున్నారన్నారు. కాబట్టి అభ్యర్థుల విషయంలో మరోసారి పునరాలోచించి మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు విజయశాంతి సూచించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకుచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించినా ఈసారి జరిగే ఎన్నికల్లో అమలయ్యే అవకాశాలు లేవని విజయశాంతి అభిప్రాయపడ్డారు. జనగణన, డీలిమిటేషన్ అంశాల దృష్ట్యా 2028-29 ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు అమలుకావచ్చని అన్నారు. అలాగని రాబోయే ఎన్నికల్లో మహిళలకు సీట్లు ఇయ్యనవసరం లేదని రాజకీయ పార్టీలు అనుకోవద్దని సూచించారు. ఇప్పటినుండి జరగబోయే ప్రతి ఎన్నికలోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని... వారి ప్రాతినిధ్యం సాధ్యమైనంతవరకు వుండేలా చూడాలని రాజకీయ పార్టీలకు విజయశాంతి సూచించారు. ఇలా నిజాయితీని నిరూపించుకుంటేనే మహిళా బిల్లుకు నిజమైన విలువ ఇచ్చినట్లు సమాజం అభిప్రాయపడుతుందని బిజెపి నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు.
త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించిందని విజయశాంతి గుర్తుచేసారు. ఒకేసారి 100కు పైగా అసెంబ్లీ సీట్లలో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్ మహిళలకు కేవలం 6 స్థానాలు మాత్రమే కేటాయించిందన్నారు. మహిళా రిజర్వేషన్ల గొంతు నొక్కిపెట్టిన బిఆర్ఎస్ పార్టీయే మోసపూరితంగా అరుస్తోందని... తెలంగాణ మహిళలకు ఇదే అనుమానం కలగుతుందని అన్నారు. నిజంగానే మహిళా రిజర్వేషన్ పై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలంటే ఇప్పటికే చేపట్టిన సీట్ల కేటాయింపు విషయంలో పున:సమీక్ష చేయాలని విజయశాంతి సూచించారు.
Read More అవినీతి, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేది బీజేపీ ఒక్కటే: కిషన్ రెడ్డి
అధికార బిఆర్ఎస్ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తే మిగతా పార్టీలపైనా ఒత్తిడి పెరుగుతుందని విజయశాంతి అన్నారు. దీంతో ప్రధాన పార్టీలన్నీ కూడా అధిక శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సిన నిర్భంధం ఏర్పడుతుందన్నారు. తద్వారా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన చారిత్రాత్మక మహిళా బిల్లుపై అన్ని రాజకీయ పార్టీల కార్యాచరణ ఇప్పటి నుండి ప్రారంభమై సార్ధకత లభిస్తుందని విజయశాంతి అన్నారు.