తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ జైలు నుండి విడుదలైన తర్వాత చేసిన వ్యాఖ్యలకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. 

హైదరబాద్ : టెన్త్ పేపర్ లీకేజి వ్యవహారం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో రాజకీయ రంగు పులుముకుంది. ఈ లీకేజీకి కారణం మీరంటే మీరంటే బిజెపి, బిఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇవాళ కరీంనగర్ జైలు నుండి విడుదలైన సంజయ్ సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దీంతో సంజయ్ కు బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కౌంటరిచ్చారు. 

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ పేపర్ లీక్ కు పాల్పడిన సంజయ్ ఏదో గణకార్యం చేసి జైలుకు వెళ్లివచ్చినట్లు డిల్లీ పెద్దలు ఫోన్ చేసి పరామర్శించడం దారుణమన్నారు. బిజెపి పెద్దల తీరు చూస్తుంటే పేపర్ లీకేజీలో వీరి హస్తం కూడా వుందేమోనన్న అనుమానం కలుగుతోందని అన్నారు. పేపర్ లీక్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన ప్రశాంత్ బిజెపి కార్యకర్త... ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారని సుమన్ అన్నారు. 

Read More మహా లక్ష్మి సన్నిధిలో చర్చకు రా బిడ్డా..: బండి సంజయ్ కు రవీందర్ సింగ్ సవాల్ (వీడియో)

చదువురాని సన్నాసి బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని సుమన్ మండిపడ్డారు. విద్యార్థుల భావోద్వేగాలతో ఆటలాడుతూ రెచ్చగొట్టే వ్యక్తులు ఎంతటవారయినా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే సుమన్ కోరారు. 

ఇక సింగరేణి బొగ్గు గనులపై సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కూడా సుమన్ రియాక్ట్ అయ్యారు. సింగరేణిని ప్రైవేటీకరించే ఉద్దేశమే కేంద్ర ప్రభుత్వానికి లేకుంటే బొగ్గు గనులను సంస్థకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్ర సిద్దమయ్యిందని... దీన్ని కూడా ఆదానీ సంస్థలకు అప్పగించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్రం పలుమార్లు వేలంపాటకు ప్రకటన ఇచ్చారని... మరోసారి నాలుగు బొగ్గుగనుల వేలానికి ప్రకటన ఇచ్చారన్నారు. 

ఇదిలావుంటే కరీంనగర్ జైలు నుండి విడుదలైన తర్వాత బండి సంజయ్ మాట్లాడుతూ... కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ కేసులు జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. అలాగే కేసీఆర్ కొడుకు, మంత్రి కేటీఆర్ ను కూడా జైలుకు పంపేందుకు రెడీ చేస్తున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.పేపర్ల లీక్ వీరులు, లిక్కర్ వీరులు కల్వకుంట్ల కుటుంబంలోనే వున్నారని బండి సంజయ్ విమర్శించారు. 

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ తో మంత్రి కేటీఆర్ కు సంబంధాలున్నాయని... వెంటనే అతడిని మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ తో నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయాల భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ డిమాండ్లతో త్వరలోనే వరంగల్ లో నిరుద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టుగా బండి సంజయ్ చెప్పారు. 

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ అంశాన్ని తెర మీదికి తెచ్చారని బండి సంజయ్ ఆరోపించారు. హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.హిందీ పేపర్ లీక్ కంటే ముందే తెలుగు పేపర్ కూడా లీకైందన్నారు. తెలుగు పేపర్ ను ఎవరు లీక్ చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పోరాడుతున్నందుకే తనపై అక్రమంగా కేసులు పెడుతున్నారని... ఏం చేసినా కేసీఆర్ సర్కార్ ను గద్దెదించేవరకు తన పోరాటం ఆగదని సంజయ్ అన్నారు.