తెలంగాణ బిజెెపి అధ్యక్షులు బండి సంజయ్ పై బిఆర్ఎస్ నాయకుడు రవీందర్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కరీంనగర్ : తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ పై రాష్ట్ర సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కాదు... దమ్ముంటే చర్చకు రావాలని సంజయ్ కు సవాల్ విసిరారు రవీందర్. కరీంనగర్ లోనా... హైదరాబాద్ లోనా... లేదంటే మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారిపై ఒట్టేసి చర్చకు సిద్దమా... తారీఖు చెప్పు బిడ్డా వస్తా... చర్చకు వెనక్కి పోతే బావుండదు అంటూ రవీందర్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
డిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆడబిడ్డ కవిత విచారణ అధికారులకు పది సెల్ ఫోన్లు ఇచ్చింది... కానీ నువ్వు అడ్డంగా దొరికిపోయిన సెల్ ఫోన్ ఎందుకు ఇవ్వడం లేదు అని సంజయ్ ని ప్రశ్నించారు రవీందర్. అలాంటి నువ్వు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి సిగ్గుండాలి అంటూ మండిపడ్డారు.
కేంద్ర పోలీసులు ఇన్వెస్టిగేషన్ చెస్తే తప్పులేదు కానీ తెలంగాణ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పొచ్చిందా సంజయ్ అంటూ నిలదీసారు.
వీడియో
ముఖ్యమంత్రి కేసిఆర్ ను విమర్శిస్తే గొప్పోడివి అవుతావా... ఎప్పటికీ కాలేవని గుర్తుంచుకో సంజయ్ అంటూ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంత అభివృద్ది తెలంగాణలో జరిగింది... ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాయని అన్నారు. దమ్ముంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలపై చర్చకు సిద్దమా అంటూ సంజయ్ కు రవీందర్ సవాల్ విసిరారు.
పేపర్ లీక్ చేసిన ప్రశాంత్ ఏబివిపిలో పని చేసాడని రవీందర్ సింగ్ ఆరోపించారు. బండి సంజయ్ కు అతడు వాట్సాఫ్ లో లీకయిన పేపర్ ఎందుకు పంపించాడు... ఇలా ఎందుకు పంపాడో సంజయ్ చెప్పాలన్నారు. కేవలం బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు పోదని ... తాను తప్పుచేయలేదని సంజయ్ నిరూపించుకోవాల్సి వుంటుందన్నారు. ఇకనైనా సంజయ్ దేనిగురించి అయినా మాట్లాడేటపుడు పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని రవీందర్ సింగ్ సూచించారు.
