Asianet News TeluguAsianet News Telugu

ఓట్ల నాడు ఒకమాట, నాట్ల నాడు మరోమాటా..! : కాంగ్రెస్ కు కేటీఆర్ కవితాత్మక సెటైర్లు

వరి రైతులకు రూ.500 బోనస్ ఇవ్వడానికి కాంగ్రెస్ సర్కార్ ముందుకు వచ్చింది. కానీ కేవలం సన్నరకం వడ్లకే బోనస్ ఇస్తామనడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే...

BRS Leader KTR demands to Congress Government to give Rs 500 bonus for all paddy varieties AKP
Author
First Published May 21, 2024, 2:24 PM IST

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రైతు భరోసా, రుణ మాపీ విషయంలో రేవంత్ సర్కార్ జాప్యం అన్నదాతల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో వరి ధాన్యం కొనుగోలుపై తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయ్యింది. వడ్ల కొనుగోలుపై బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ప్రకటన రాజకీయ విమర్శలు దారితీసింది. వరి పండించే ప్రతి రైతుకు బోనస్ ఇస్తామని... ఇప్పుడేమో కేవలం సన్న బియ్యం పండించే వారికే బోనస్ ఇస్తామని ప్రకటించమేంటని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. 

మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సీఎంరేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలిచ్చి... ఇప్పుడు మాట మారుస్తారా అంటూ మండిపడ్డారు. రైతుల పక్షాన నిలుస్తూ రేవంత్ సర్కార్ పై కవితాత్వకంగా ప్రశ్నలు గుప్పించారు కేటీఆర్. 

కేటీఆర్ ట్వీట్ యధావిధిగా : 

ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం.. దగా.. నయవంచన..

గ్యారెంటీ కార్డులో.. 
“వరిపంటకు” రూ.500 బోనస్ అని ప్రకటించి.. 
ఇప్పుడు “సన్న వడ్లకు మాత్రమే” అని 
సన్నాయి నొక్కులు నొక్కుతారా ??

ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి..
ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా ??

ఇది ప్రజా పాలన కాదు..
రైతు వ్యతిరేక పాలన

నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు..
కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు..
కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా
అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారు.. 

ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు 
రూ.15 వేలు రైతుభరోసా అన్నారు .. ఇవ్వలేదు

వ్యవసాయ కూలీలకు
రూ.12000 వేలు అన్నారు.. వేయలేదు

ప్రతి రైతుకు డిసెంబర్ 9నే..
రెండు లక్షల రుణమాఫీ అన్నారు.. చేయలేదు 

నేడు బోనస్ విషయంలో కూడా 
ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారు. 

ఓట్ల నాడు ఒకమాట...
నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం 

అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో 
గారడీ చేసింది.. కాంగ్రెస్ పార్టీ

పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే.. 
నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని 
బయటపెట్టింది.. కాంగ్రెస్ సర్కారు 

ఎద్దేడ్సిన యవుసం..
రైతేడ్చిన రాజ్యం నిలబడదు.. 

నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన 
కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరు..

పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు.. 
తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు..
కపట కాంగ్రెస్ పై సమరశంఖం పూరిస్తారు..

నేటి నుంచి రైతన్నల చేతిలోనే.. 
కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ.. 

జై కిసాన్
జై తెలంగాణ

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios