Harish Rao: బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు హరీశ్ రావు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి అనుమతులు లేవని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.
Harish Rao: తెలంగాణ భవన్‌లో శనివారం (జూన్ 14) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల సమక్షంలో నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రెజెంటేషన్ ఇచ్చిన సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్ రావు.. బీజేపీ, కాంగ్రెస్ ల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణ నష్టం జరుగుతుందని తెలిపారు. దీనిని వ్యతిరేకించేందుకు సత్వరమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
“సీఎం రేవంత్, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు. ప్రతిపక్షాల మీద ఇరిటేషన్ తప్ప, ఇరిగేషన్ మీద దృష్టి లేదు. రాష్ట్ర ప్రయోజనాలు పదవుల కోసం తాకట్టు పెడుతున్నారు”: హరీష్ రావు
అనుమతులు లేకుండానే బనకచెర్ల ప్రాజెక్టు ప్రారంభం?
బనకచెర్ల ప్రాజెక్టుకు సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) లేదా అపెక్స్ కౌన్సిల్ నుండి ఎలాంటి అనుమతులు లేవని హరీష్ రావు పేర్కొన్నారు. అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుండటాన్ని ఆయన ఖండించారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ మౌనంగా ఉండటాన్ని తప్పుబట్టారు.
కేంద్రానికి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేసిన హరీష్ రావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ చివర్లో టెండర్లు పిలిచి, జూలైలో పనులు ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉందని ఆరోపించిన హరీష్ రావు.. కేంద్రం దీనిని అంగీకరించడం అన్యాయమన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణపై FRBM రుణ పరిమితుల విషయంలో నిరాకరణ చూపించి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు బనకచెర్ల ప్రాజెక్టుకు 50 శాతం నిధులు మంజూరు చేయడం దారుణమని విమర్శించారు. అంతేకాక, రూ. 40,000 కోట్లు అదనంగా FRBM రుణంగా ఇచ్చినట్లు తెలిపారు.
గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ హక్కులపై హరీష్ రావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నుంచి 400 టీఎంసీలు నీరు వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుండటాన్ని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ పనులు జరుగుతున్నా, సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడాన్ని హరీష్ రావు తప్పుబట్టారు.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా ఏపీ రోజుకు 90,000 క్యూసెక్కుల నీరు తీసుకునేలా మారుతుందని హెచ్చరించారు. దీంతో 8 టీఎంసీలు అదనంగా వాడుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.
తెలంగాణ ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి
గోదావరి జలాల వినియోగాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని హరీష్ రావు అన్నారు. కళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు వెంటనే చేపట్టాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
“రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడకుండా రేవంత్ రెడ్డి స్పందించాలని కోరుతున్నా” అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లను కూడా ఈ విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
