- Home
- Telangana
- Telugu States Rain Alert : తెలుగు ప్రజలారా.. ఏ పనులున్నా ఇప్పుడే చేసుకొండి, సాయంత్రం కుదరకపోవచ్చు
Telugu States Rain Alert : తెలుగు ప్రజలారా.. ఏ పనులున్నా ఇప్పుడే చేసుకొండి, సాయంత్రం కుదరకపోవచ్చు
వీకెండ్ కాబట్టి ఎక్కడికైనా బయటకు వెళ్లేందుకు, ఏదయినా పనులు చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారా? అయితే ఇప్పుడే అవి చేసుకొండి.. సాయంత్రం కుదరకపోవచ్చు. ఎందుకో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు
Andhra Pradesh Telangana Weather : నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) ప్రకటించింది. కాబట్టి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
జూన్ 14 తెలంగాణ వాతావరణ సమాచారం
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ(జూన్ 14 శనివారం) భారీ వర్షాలు, పలుచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన నారాయణపేట, మహబూబ్ నగర్, గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, రంగారెడ్డి... ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ లో సాయంత్రం లేదా రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
తెలంగాణలో కూల్ వెదర్
భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని... మిగతాచోట్ల వర్షాలు కురవకున్నా వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపారు.
నేడు హైదరాబాద్ లో వాతావరణం ఎలా ఉంటుందంటే..
హైదరాబాద్ లో అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మధ్యాహ్నం నగరంలో ఉక్కపోత ఉంటుందని... సాయంత్రానికి ఆకాశం మేఘాలతో కమ్ముకుని వాతావరణం చల్లబడుతుందని తెలిపారు. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని... భారీ వర్షాలేమీ ఉండవని తెలిపారు. వర్షాలు లేకుండా చల్లగా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ వీకెండ్ ను హైదరబాదీలు ఎంజాయ్ చేయవచ్చు.
జూన్ 14 ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ సమాచారం
ఆంధ్ర ప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ (శనివారం) కూడా ఈ వర్షాలు కొనసాగుతాయని... రాబోయే ఐదురోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు... అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు.
ఏపీ ప్రజలు జాగ్రత్త.. పొంచివున్న పిడుగుల ప్రమాదం
ఇవాళ అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయట. అయితే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలేమీ ఉండవని... కానీ బలమైన ఈదురుగాలులు, పిడుగులతో ప్రమాదం పొంచివుందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. కాబట్టి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని... వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదని సూచించారు. ప్రజలు కూడా ఈదురుగాలులు, వర్షం సమయంలో బయటకు రాకూడదని.. ఏవయినా అత్యవసర పనులుంటే ఉదయం లేదా మధ్యాహ్నమే పూర్తిచేసుకోవాలని సూచిస్తున్నారు.