రంగారెడ్డి: తెల్లవారితే పెళ్లి. ఇళ్లంతా బంధువులు సందడి, స్నేహితుల పెళ్లి ఏర్పాట్లతో కోలాహలంగా వుంది. ఇలా పెళ్లిసందడితో ఆనందంగా వున్న ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. పెళ్లి కొడుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో చావుబాజా మోగుతోంది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్ల తలకొండపల్లి మండలం మెదక్ పల్లికి చెందిన లింగయ్య-యాదమ్మ దంపతుల కుమారుడు శ్రీకాంత్ గౌడ్(25)కు ఇటీవలే వివాహం నిశ్చమయ్యింది. ఇవాళ(శనివారం) పెళ్ళి జరగాల్సి వుంది. ఈ క్రమంలోనే కుటుంబసభ్యులంతా పెళ్లి పనుల్లో నిమగ్రమై వుండగా శ్రీకాంత్ దారుణానికి పాల్పడ్డాడు. 

శుక్రవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు ఓవైపు పెళ్ళిపందిరి వేస్తుండగా మరోవైపు వరుడు శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్తగా నిర్మించిన ఇంటివద్ద కోలాహలంగా వుందని పాత ఇంటికి చేరుకున్న శ్రీకాంత్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోదరుడు వచ్చిచూడగా ఉరేసుకుని వేలాడుతూ  కనిపించాడు. దీంతో అతడు కుటుంసభ్యులకు విషయం తెలపడంతో దిగ్భ్రాంతికి గురయిన వారు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

మృతుడు శ్రీకాంత్ కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి కోసం అంతా రెడీ అయిన సమయంలో ఇలా వరుడు శ్రీకాంత్‌ ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.