వారిద్దరూ ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ చివరకు సీన్ రివర్స్ అయ్యింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు పెట్టిన బాధలను ఆమె తట్టుకోలేకపోయింది. చివరకు పెళ్లైన ఆరు నెలలకే నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. భార్య మరణ వార్త తెలియగానే.. ఆమె భర్త కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సూర్యాపేటలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ కు చెందిన ఎడ్ల లావణ్య(21) సూర్యాపేటకు చెందిన పెద్ద పంగ ప్రణయ్ ప్రేమించుకున్నారు. గతేడాది జూన్ 12న పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వివాహ సమయంలో కట్నకానుకల కింద అమ్మాయి తల్లిదండ్రులు రూ.30లక్షలు విలువైన వ్యవసాయ భూమి, నగదు అప్పగించారు.

కాగా... ఆ కట్నం సరిపోలేదని.. మరింత కట్నం కావాలంటూ ప్రణయ్ కుటుంబసభ్యులు.. లావణ్యను వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మూడురోజుల క్రితం ప్రణయ్ భార్య లావణ్యను సూర్యాపేటలోని పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. దీంతో... తీవ్ర మనస్థాపానికి గురైన లావణ్య.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. పురుగుల మందు తాగింది.

అనంతరం తాను పురుగుల మందు తాగానంటూ భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఆ విషయం తెలియగానే ప్రణయ్ కూడా పురుగుల మందు తాగేశాడు. గమనించిన కుటుంసభ్యులు వారిని వేర్వేరు ఆస్పత్రులకు తీసుకువెళ్లగా.. లావణ్య ప్రాణాలు కోల్పోయింది. ప్రణయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. లావణ్య తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.