ఎన్నో ఆశలతో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. భర్తతో జీవితాంతం ఆనందంగా ఉండాలని ఆశపడింది. కానీ ఆమె ఆశలు ఆదిలోనే అడియాశలు అయ్యాయి. కన్న తల్లే ఆమె ఆశలపై నిప్పులు పోసింది. తాను కట్టుకున్న భర్తతో తల్లి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ చేదు నిజాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో... ఆ నవ వధువు అర్థాంతరంగా తనవు చాలించింది. ఈ విషాదకర  సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...మీర్‌పేట అల్మాస్‌గూడకు చెందిన వేలూరి అనిత కొన్నేళ్లుగా భర్త బాబురావుతో విడిపోయి.. క్యాటరింగ్‌ పనులు చేస్తూ పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ప్రేమ్‌ నవీన్‌కుమార్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

కూతుళ్లు పెళ్లీడుకు వచ్చిన వయసులో తాను పెళ్లి చేసుకుంటూ సమాజం ఒప్పుకోదని తన ప్రియుడితో కలిసి  పథకం వేసింది. ప్రియుడిని వదిలి ఉండలేక.. కన్న కూతురిని బలిపశువు చేసింది.ఈ క్రమంలోనే తన ప్రియుడితో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న పెద్ద కూతురు వందన(19) తో వివాహం చేయించింది. తల్లి మనసులో ఉన్న కుట్రను గుర్తించలేని వందన... కొత్త ఆశలతో తల్లి చూపించినవాడితో మెడలో తాళి కట్టించుకుంది.

Also Read రెండు రోజుల్లో ఇంట పెళ్లి... కుటుంబాన్ని మింగేసిన రోడ్డు ప్రమాదం...

అల్లుడి హోదా దక్కించుకున్న నవీన్... కి ఆ ఇంటికి రావడానికి అడ్డులేకుండా పోయింది. దీంతో.. తనకు నచ్చినప్పుడల్లా వచ్చేవాడు. అలా వచ్చినవాడు కట్టుకున్న భార్యతో కాకుండా.. ఆమె తల్లితోనే ఎక్కువ సేపు సమయం గడిపేవాడు.భార్యను పట్టించుకోకుండా అనితతో నవీన్... తన బంధాన్ని ఆనందంగా సాగించేవాడు. కొన్నాళ్లకు ఈ విషయం వందనకు అర్థమైపోయింది. ముందు షాకైంది. తర్వాత తేరుకొని భర్తను మార్చుకునే ప్రయత్నం చేసింది. 

తల్లితో కాకుండా భర్తతో కలిసి వేరేకాపురం పెట్టాలని భావించింది. ఆమేరకు భర్తను ఒప్పించే ప్రయత్నం చేసింది. అలా చేస్తే.. ఎక్కడ తన ప్రియుడు తనకు దూరమైపోతాడో అనే భయంతో... చచ్చిపోతా అంటూ అనిత డ్రామాలు ఆడింది. దీంతో.. వేరే కాపురం కూడా పెట్టించలేక వందన ఫెయిల్ అయ్యింది.
వీరిద్దరి ప్రవర్తన కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురైన వందన గురువారం రాత్రి సూసైడ్‌ నోట్‌ రాసి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి సోదరి సంజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.