విషాదం : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గుంతలో పడి బాలుడి మృతి..
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నీటి గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందాడు.
హైదరాబాద్ : హైదరాబాదులో మరో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నీటి గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది. పిల్లలు ప్రతీరోజూ అక్కడికి వచ్చి ఆడుకుంటారు. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
చనిపోయిన చిన్నారి రెండో తరగతి చదువుతున్నాడు. పక్కనే ఉన్న షోరూంలో చిన్నారి తల్లిదండ్రులు పనిచేస్తుంటారని తెలుస్తోంది. వేస్ట్ వాటర్ తీయడం కోసం ఆ గుంతను తవ్వినట్టుగా అక్కడి వారు చెబుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆ గుంత నిండిపోయింది. దానిమీదున్న కర్ర మీదికి ఎక్కడానికి బాలుడు ప్రయత్నించడంతో పట్టుతప్పి గుంతలో పడిపోయాడని చెబుతున్నారు.
వెంటనే అతనితోపాటు ఆడుకుంటున్న పిల్లలు సమాచారాన్ని షోరూంలో ఉన్న వారికి చెప్పగా.. వారు వచ్చి తీసేసరికి అప్పటికే అతను మరణించాడు. ప్రతిరోజూ అక్కడ నలుగురు పిల్లలు ఆడుకోవడానికి అక్కడికి వస్తుంటారని స్థానికులు చెబుతుంటారు. ఉదయం 9.30 సమయంలో కొత్త బట్టలు వేయమని అడిగాడని తల్లి చెబుతోంది. బర్త్ డే కు వేసుకుందువు అన్నా కూడా వినలేదని.. కొత్త బట్టలు వేసుకున్నాడని.. అదే తనకు చివరి చూపు అవుతుందనుకోలేదని ఆ తల్లి ఏడవడం అందరినీ కలిచివేస్తుంది. దీని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.