హైద్రాబాద్‌లో ప్రేమించలేదని బాలికపై దాడి: ఆ తర్వాత ఆత్మహత్య
హైద్రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది . ట్యూషన్ కు వెళ్లిన బాలికపై బాలుడు దాడికి దిగాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్:ప్రేమించాలని బాలికపై కత్తితో దాడి చేసిన బాలుడు శుక్రవారం నాడు ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైద్రాబాద్ విద్యానగర్ లో చోటు చేసుకుంది.
హైద్రాబాద్ లో రమణ అనే బాలుడు ఓ బాలికను ప్రేమించాలని వేధింపులకు గురి చేశారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. తనను ప్రేమించడం లేదని బాలికపై బాలుడు గురువారం నాడు రాత్రి అంబర్ పేటలో దాడికి దిగాడు. ఈ దాడిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన టీచర్ పై కూడ నిందితుడు దాడికి దిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో వీరిద్దరికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన తర్వాత రమణ అక్కడి నుండి పారిపోయాడు. ఇవాళ ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.
గురువారంనాడు రాత్రి ట్యూషన్ కు వెళ్లిన బాలికపై నిందితుడు దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న టీచర్ ఈ దాడిని అడ్డుకొనే ప్రయత్నం చేసింది. కానీ ఈ దాడిలో బాలికతో పాటు టీచర్ కూడ గాయపడింది. ఈ ఘటనతో షాక్ కు గురైన ఇతర స్టూడెంట్స్ కేకలు వేశారు. స్థానికులు రావడంతో నిందితుడు పారిపోయాడని పోలీసులు చెప్పారు. ఇవాళ ఉదయం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పేరుతో వేధింపులు, అత్యాచారాలు, హింసించే వారి విషయంలో ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకు వచ్చినా ఈ తరహా ఘటనలు తగ్గడం లేదని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరహా ఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. మరో వైపు ఈ తరహా వేధింపులకు పాల్పడేవారిని మంచి మార్గంలో నడిచేలా పరివర్తన తెచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
ఆత్మహత్యలు పరిష్కారం కావు
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.