బోర్ వేస్తుండగా కేవలం మూడు అడుగుల లోతులోనే నీరుపడిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది.
హైదరాబాద్ : ఇష్టం వచ్చినట్లు బోర్లు వేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే పలు పట్టణాలు, నగరాల్లో నీటి కటకటతో అల్లాడుతున్నాయి. హైదరాబాద్ లోనూ కొన్ని ప్రాంతాల్లో వందల అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్కనీరు రాని పరిస్థితి. కానీ ఖైరతాబాద్ ప్రాంతంలో కేవలం మూడు అడుగుల లోతులోనే నీరు ఉబికివచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంత తక్కువ లోతులో నీరుపడటంతో అధికారులకు అనుమానం వచ్చి తవ్విచూడగా అసలు విషయం బయటపడింది.
అధికారులు, స్థానిక ప్రజలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఖైరతాబాద్ చింతల్ బస్తీ ప్రాంతంతో ప్రజల సౌకర్యార్థం సామాజిక భవనాన్ని నిర్మించారు. ఈ క్రమంలోనే స్థానిక ఎంపీ నిధులతో బోర్ వేస్తుండగా విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అయితే సామాజిక భవనం సమీపంలో బోర్ వేసేందుకు అవకాశం లేకపోవడంతో రోడ్డుపక్కన వేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఓ స్థలాన్ని నిర్దారించి భారీ యంత్రాలతో అక్కడికి చేరుకున్నారు. స్థానిక నాయకులు పూజలు చేసి బోరర్ వేయడం ప్రారంభించారు.
బోర్ వేయడం ఇలా ప్రారంభించారో లేదో అలా నీరు పైకి ఉబికివచ్చింది. కేవలం మూడు అడుగుల లోతు కూడా తవ్వకుండానే నీరుపడటంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. బోరు తవ్వడం ఆపినా నీరు ఉబికివస్తూనే వుంది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అక్కడ తవ్వించగా సరిగ్గా నీటి పైపుమీదే బోర్ వేస్తున్నట్లు బయటపడింది. నీటిపైపు పగలడంతో నీరు ఉబికివచ్చినట్లు బయటపడింది. వెంటనే స్థానిక నాయకులు ఆ పక్కనే మరోచోట బోర్ వేయించారు. అక్కడ దాదాపు 40 అడుగుల లోతులో నీరుపడింది.
Read More హైద్రాబాద్ లో కుప్పకూలిన స్లాబ్: ఒకరి మృతి, మరో 9 మందికి గాయాలు
రోడ్డుపక్కనే బోర్ వేయడంతో ఈ పరిస్థితి నెలకొందరి అధికారులు అంటున్నారు. 50ఏళ్ల కిందటి పైప్ లైన్ వేసివుండవచ్చని... అందువల్లే ఈ విషయం స్థానికులకు తెలియలేదు. దీంతో అక్కడ బోర్ వేయగా పైప్ లైన్ పగిలి నీరు బయటకు వచ్చింది. జలమండలి అధికారులు పైప్ లైన్ కు మరమ్మతులు చేయించి నీటి సరఫరా పునరుద్దరించారు.
