హైదరాబాద్: ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో నిందితులు భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనుల ఆచూకీ పోలీసులకు తెలిసినట్లు సమాచారం. భార్గవ్ రామ్ మహారాష్ట్రలోనూ గుంటూరు శ్రీను కర్ణాటకలోనూ తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్లాయి. 

ఈ నెల 5వ తేదీన ప్రవీణ్ రావు, ఆయన సోదరులను కిడ్నాప్ చేయించి మొయినాబాదులోని ఫామ్ హౌస్ కు తీసుకుని వెళ్లి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. ఆ తర్వాత వారిని వదిలేసి వేర్వేరు మార్గాల్లో హైదరాబాదు దాటి పారిపోయారు. ఆ తర్వాత కొన్ని గంటల పాటు భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను ఫోన్ లో మాట్లాడుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సిమ్ కార్డులను పారేశారు. 

Also Read: మూడు రోజుల కస్టడీలో 300 ప్రశ్నలు: అఖిలప్రియ నుండి కీలక సమాచారం సేకరణ

వారిద్దరు మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్నట్లు సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు కనిపెట్టారు. కిడ్నాప్ వ్యవహారం మొత్తాన్ని పర్యవేక్షించిన భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను ఒకే కారులో ఉన్నారా, ఇంట్లోకి వెళ్లి కిడ్నాప్ చేశారా అనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. కిడ్నాప్ జరిగిన రోజు మాత్రం వారిద్దరు ఒకే కారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

అపహరణ జరిగిన ముందు రోజు మాత్రం వారిద్దరు కూకట్ పల్లి, బంజారాహిల్స్, పంజగుట్ట, బేగంపేట ప్రాంతాల్లో ఒకే కారులో తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. వారిద్దరు ప్రయాణించిన కారు వెళ్లిన మార్గాలు చౌరస్తాల్లోని నాలుగైదు సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించాయి. ఆ సమయంలో భార్గవ్ రామ్ మాస్క్ ధరించలేదు. దాంతో పోలీసులు గుర్తించడానికి సులభమైంది. 

See video: వాట్ ఏ ట్రైనింగ్: నిందితులకు సినిమా చూపిస్తూ భూమా అఖిల ప్రియ కిడ్నాప్ ప్లాన్

ప్రవీణ్ రావు ఇంటికి వచ్చిన కార్లలో కాకుండా మరో కారులో భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనులు ఉన్నట్లు ఆదారాలున్నాయి. అయితే వారు ప్రవీణ్ రావు ఇంట్లోకి వెళ్లారా, లేదా అనేది నిర్ధారణ కావడం లేదు. 

ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసు కొలిక్కి వచ్చిందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు. కీలక నిందితులతో సహామ మిగిలినవారందరినీ రెండు రోజుల్లో అరెస్టు చేస్తామని చెప్పారు. ఇదిలావుంటే, టీడీపీ నేత భూమా అఖిలప్రియ పోలీసు కస్టడీ గురువారం మధ్యాహ్నం ముగుస్తుంది. ఆమెను న్యాయస్థానంలో హాజరు పరిచిన తర్వాత చంచల్ గుడా జైలుకు తరలిస్తారు.