Asianet News TeluguAsianet News Telugu

అన్న కెసిఆర్‌ను దీవించండి

బంగారు తెలంగాణ కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్న సిఎం కెసిఆర్‌ను దీవించాల‌ని కవిత నిజాంబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు 

bless your brother kts kavita asks nizambad people

ఆడ‌బిడ్డ‌ల‌కు బ‌తుక‌మ్మ పండుగకు  చీర‌ల‌ను కానుక‌గా ఇచ్చిన మీ అన్న సిఎం కెసిఆర్‌ను దీవించాల‌ని నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌హిళ‌ల‌ను కోరారు. సోమ‌వారం నిజామాబాద్‌లో బ‌తుక‌మ్మ పండుగ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు అంద‌జేస్తున్నచీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొని మ‌హిళ‌ల‌కు చీర‌లను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌మావేశంలో ఎంపి క‌విత మాట్లాడుతూ ఉద్య‌మంలో మీరంతా కెసిఆర్‌కు అండ‌గా ఉండ‌డం వ‌ల్లే తెలంగాణ వ‌చ్చింది. ఇప్పుడు బంగారు తెలంగాణ కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్న సిఎం కెసిఆర్‌ను దీవించాల‌ని కోరారు. బ‌తుక‌మ్మ‌పండుగ‌కు అన్న పెట్టిన చీర‌ను క‌ట్టుకుంటే..ఆడ‌బిడ్డ‌ల‌కు ఎంతో సంతోషంగా ఉంటుంద‌న్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మ‌హిళ‌లంద‌రికీ బ‌తుక‌మ్మ పండుగ‌కు చీర‌ను కానుక‌గా ఇస్తున్నార‌ని క‌విత వివ‌రించారు. రాష్టంలో ఒక కోటి నాలుగు ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తున్నార‌ని, ఒక్క నిజామాబాద్ జిల్లాలో 5 ల‌క్ష‌ల 13 వేల చీర‌లు పంపిణీ చేస్తున్నామ‌ని తెలిపారు. ఒక్క నిజామాబాద్ టౌన్‌లోనే 90 వేల మంది ఆడ‌బిడ్డ‌ల‌కు చీర‌ల‌ను అంద‌జేస్తున్న‌ట్లు ఎంపి క‌విత తెలిపారు. 

తెలంగాణ‌లో  స‌ద్దుల బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండుగ‌లు పెద్ద‌వ‌న్నారు. మ‌నం ఏ ప‌నిచేసినా ఒక అర్థం ఉండాలి...ఆలోచ‌న కూడా ఉండాలి..ఇవి రెండూ కెసిఆర్‌లో ఉన్నాయ‌న్నారు. తెలంగాణ కోసం ఉద్య‌మం చేస్తున్న‌ప్పుడు ఎన్నో అడ్డంకులు, క‌ష్టాలు ఎదుర‌య్యాయి. అయినా..కెసిఆర్ వెన‌క‌డ‌గు వేయ‌లేదు కాబ‌ట్టే తెలంగాణ తెచ్చుకున్నాం..అని అన్నారు. ఒక అవ్వ‌, తాత‌లు మూడు పూట‌లా అన్నం, పప్పు తిన‌డానికి ఎంత డ‌బ్బు అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని సిఎం కెసిఆర్ ప్ర‌భుత్వం వ‌చ్చిన కొత్త‌లో అడిగార‌ని, రూ.736 స‌రిపోతాయ‌ని అధికారులు తెలిపితే...పండుగ‌ల‌కు ఇంటికి వ‌చ్చే కూతురు, మ‌న‌వ‌డు, మ‌న‌వారాళ్ల‌కు ఏద‌యినా పెట్టాలంటే ఇబ్బంది ప‌డ‌తార‌ని భావించి రూ. 200 ఉన్న పెన్ష‌న్‌ను రూ. 1 వెయ్యికి పెంచార‌ని క‌విత తెలిపారు. 
అలాగే  తెలంగాణ వ‌చ్చిన త‌ర‌వాత ప్ర‌భుత్వ ప‌రంగా బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనారిటీల‌కు మేలు  జ‌ర‌గాల‌ని ఆలోచ‌న చేసిన సిఎం ఆ దిశ‌కా ప‌థ‌కాల‌ను రూపొందించి అమ‌లు చేస్తున్నార‌ని తెలిపారు. బ‌తుక‌మ్మ పండుగ‌ను రాష్ట్ర పండుగ‌గా ప్ర‌క‌టించి రూ. ప‌ది కోట్ల రూపాయ‌ల‌ను మంజూరు చేసిన సిఎం కెసిఆర్‌కు ఆడ‌బిడ్డ‌లు అంటే ఎంత ప్రేమ ఉన్న‌దో అర్థం అవుతుంద‌న్నారు ఎంపి క‌విత‌. అలాగే బోనాల పండుగ‌ను కూడా రాష్ట్ర పండుగ‌గా ప్ర‌క‌టించి గుడుల‌ను అందంగా అలంక‌రింప‌చేశార‌ని, అమ్మ‌వారికి బ‌ట్ట‌లు పెట్టార‌ని వివ‌రించారు. రంజాన్‌, క్రిస్మ‌స్ పండుగ‌ల‌కు కూడా పేద‌ల‌కు బట్ట‌లు పంపిణీ చేసిన విష‌యం మీకంద‌రికి తెలుసున్నారు. మ‌హిళ‌లంద‌రికి బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు క‌విత‌. స‌మావేశంలో రామ రామ ఉయ్యాలో...అంటూ బ‌తుక‌మ్మ పాట‌ను పాడి ఆడ‌బిడ్డ‌ల‌ను ఉత్సాహ‌ప‌రిచారు. క‌విత ఉయ్యాల పాట‌కు మ‌హిళ‌లు కోర‌స్‌గా ఉయ్యాలో...అంటూ పాడారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి పోచార శ్రీనివాస్ రెడ్డి, జ‌హీరాబాద్ ఎంపి బీబీపాటిల్‌, ఎమ్మెల్సీలు వీజీగౌడ్‌, భూపాల్ రెడ్డి, ఆకుల ల‌లిత‌, ఎమ్మెల్యేలు గ‌ణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఆశ‌న్నగారి జీవ‌న్ రెడ్డి, ష‌కీల్ అమిర్‌, జ‌డ్పీ ఛైర్మ‌న్ ద‌ఫేదార్ రాజు, మేయ‌ర్ ఆకుల సుజాత, డిసిసిబి ఛైర్మ‌న్ గంగాధ‌ర్‌రావు ప‌ట్వారీ, స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios