సిద్దిపేట: టీఆర్ఎస్ కు రాజకీయ సమాధి దుబ్బాక నుండే మొదలు కానుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.
సోమవారం నాడు రాత్రి ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని ఆయన చెప్పారు.

also read:నగదు ఎత్తుకెళ్లిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తాం: సీపీ జోయల్ డేవిస్

తనపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మా దమ్ము, ధైర్యం ఏమిటో త్వరలోనే చూపిస్తామని ఆయన చెప్పారు. తక్షణమే సిద్దిపేట సీపీ డేవిస్ ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సిద్దిపేట సీపీపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని ఆయన ప్రకటించారు.దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తోందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో వరదల్లో చిక్కుకు పోయిన బాధితులను కేసీఆర్ కనీసం పరామర్శించలేదన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను రాష్ట్రంలో ఎక్కడికైనా తిరిగే హక్కుందన్నారు.

సిద్దిపేటలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు  బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు.ఈ సోదాల్లో రూ. 18 లక్షలను స్వాధీనం చేసుకొన్నామని సీపీ చెప్పారు. ఈ విషయం తెలుసుకొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సిద్దిపేటకు వెళ్తున్న సమయంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. సిద్దిపేటకు వెళ్లకుండా ఆయనను కరీంనగర్ కు తరలించారు.