హైదరాబాద్: నూతనంగా గెలిచిన కార్పోరేట్లను గుర్తించేలా గెజిట్ ను విడుదల చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని బీజేపీ రాష్ట్ర గవర్నర్ ను కోరింది.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం శుక్రవారం నాడు  ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ మేరకు  బీజేపీ నేతలు  గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా రాజ్‌భవన్ వెలుపల బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

కేసీఆర్, ఓవేసీ చేతిలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిందని ఆయన ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికలు ముగిసి నెల రోజులు దాటినా కూడ ఇంత వరకు కొత్త కార్పోరేటర్లు ఎన్నికైనట్టుగా గెజిట్ ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలని ఆయన కోరారు.

కుంటి సాకులతో ప్రజలను కేసీఆర్ సర్కార్ మోసం చేస్తోందని ఆయన విమర్శించారు.మూడు నెలల టైం ఉంటే  ముందుగానే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు నిర్వహించారని ఆయన ప్రశ్నించారు. 

ప్రజలు వరద కష్టాల్లో ఉన్న సమయంలో ఎన్నికలు ఎందుకు నిర్వహించారో చెప్పాలని ఆయన అడిగారు.  బీజేపీ గెలుస్తోందనే  ఉద్దేశ్యంతోనే ముందుగా ఎన్నికలు నిర్వహించారని ఆయన ఆరోపించారు. 

మేయర్ ఎన్నికను ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలన్నారు. ఓటమి పాలైన కార్పోరేటర్లతో శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలు చేయడంపై బండి సంజయ్ మండిపడ్డారు.