కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి: టీఎస్‌సీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ పై గన్ పార్క్ వద్ద బండి దీక్ష
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ గన్ పార్క్ వద్ద దీక్షకు దిగారు.
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం నాడు గన్ పార్క్ వద్ద దీక్షకు దిగారు. టీఎస్‌పీఎస్‌సీ లో ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై జ్యుడిషీయల్ విచారణ కోరుతూ బండి సంజయ్ దీక్షకు దిగారు. బీజేపీ కార్యాలయం నుండి గన్ పార్క్ వద్దకు బండి సంజయ్, బీజేపీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరారు. గన్ పార్క్ వద్ద బండి సంజయ్ దీక్షకు దిగారు. అయితే బండి సంజయ్ గన్ పార్క్ వద్ద దీక్షకు దిగడంతో పోలీసులు ఆయనను దీక్ష విరమించాలని కోరారు. పోలీసులు గన్ పార్క్ నుండి వెళ్లిపోవాలని బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించారు.టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీని నిరసిస్తూ బీజేపీ అనేక రూపాల్లో ఉద్యమించనుందని ఆయన చెప్పారు. ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తల ఇండ్లల్లో చొరబడి అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేస్తే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. పోలీసుల అనుమతి తీసుకోని గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించాలా? అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ నిర్వాకంవల్లే పేపర్ లీకేజీ అయ్యిందన్నారు. ధరణి పోర్టల్ అక్రమాల్లోనూ నీ కేటీఆర్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
పేపర్ లీకేజీతో నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే లిక్కర్ క్వీన్ ను కాపాడుకునేందుకు కెబినెట్ అంతా ఢిల్లీ వెళతారా? అని సెటైర్లు వేశారు. మంత్రులకు సిగ్గు లేదా? నిరుద్యోగుల కంటే కేసీఆర్ బిడ్డే మీకు ముఖ్యమా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో నీళ్లు-నిధులు-నియామకాల్లోనూ అక్రమాలేనని బండి సంజయ్ ఆరోపించారు బీఆర్ఎస్ సర్పంచ్ బిడ్డ కోసం పేపర్ లీకేజీ చేస్తారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
కుంటిసాకులు చెప్పి ఈటల రాజేందర్ ను కేసీఆర్ భర్తరఫ్ చేశాడన్నారు. కానీ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన కేటీఆర్ ను ఎందుకు భర్తరఫ్ చేయడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన కోరారు. టీఎస్సీఎస్సీ ఛైర్మన్ ఎవరిని నమ్మి మోసపోయారో స్పష్టం చేయాలన్నారు.టీఎస్సీస్సీ ఛైర్మన్ సహా సభ్యులందరినీ తొలగించి ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ చెంప చెళ్లుమన్పించిన ఉపాధ్యాయులాందరికీ సెల్యూట్ చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు..
టీఎస్పీస్సీ అక్రమాలను ప్రశ్నిస్తే తప్పేముందన్నారు. టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళుతున్నానని ఆయన ప్రకటించారు. పేపర్ లీకేజీ అక్రమాలపై వాస్తవాలు తెలుసుకుంటామన్నారు. బీజేపీ కార్యకర్తలంతా టీఎస్పీఎస్సీకి తరలి రావాలని ఆయన కోరారు.