రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలా?: స్పీకర్ పై బండి సంజయ్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ విమర్శలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు.. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ పెద్దన్న పాత్ర పోషించాల్సిన స్పీకర్ రాజకీయ విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు.
హైద్రాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొత్తగా నియమితులైన పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా ఇంఛార్జ్ లతో బుధవారం నాడు బండి సంజయ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
అసెంబ్లీలో సభ్యులందరినీ సమన్వయం చేస్తూ సభ సజావుగా జరిగేలా పెద్దన్న పాత్ర పోషించాల్సిన స్పీకర్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. స్పీకర్ తీరుపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ అంటేనే కేసీఈర్ గజగజ వణికిపోతున్నారని బండి సంజయ్ చెప్పారు.అసెంబ్లీలో ప్రజా సమస్యలపై బీజేపీ సభ్యులు నిలదీస్తారనే భయం కేసీఆర్ కు పట్టుకుందన్నారు. ఈ కారణంగానే అసెంబ్లీని రెండ్రోజులపాటే నిర్వహిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై బీజేపీ సభ్యులు స్పీకర్ ను ప్రశ్నిస్తే వారిపై చర్యలు తీసుకోవాలంటూ చర్చ చేస్తుండటం సిగ్గు చేటన్నారు.
రాజ్యాంగ బద్ద పదవిలో ఉంటూ సభ్యులందరినీ సమన్వయం చేస్తూ ప్రజా సమస్యలపై చర్చిస్తూ సభ సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉందన్నారు. స్పీకర్ హోదాలో ఉంటూ కేంద్రమంత్రిపై రాజకీయ విమర్శలు చేస్తారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. రాజ్యంగబద్ద పదవిలో ఉంటూ రాజ్యాంగ విరుద్ధంగా ఇంకొకరిని విమర్శించే హక్కు ఆయనకు ఎక్కడిదని ఆయన అడిగారు. ఈ విషయమై సభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
స్పీకర్ పదవికే కళంకం తీసుకొస్తున్న పోచారం శ్రీనివాసరెడ్డి పైనే ముందు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సభలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. అందుకే సభ కూడా పూర్తిస్థాయిలో జరపకుండా రెండ్రోజులకే పరిమితం చేస్తున్నారని ఆయన చెప్పారు.
ప్రజా సమస్యలపై చర్చించి అసెంబ్లీ వేదికగా పరిష్కారం లభించేలా చేయాలని బీజేపీ సభ్యులు ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే ఇందుకు భిన్నంగా సీఎం వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించే అవకాశం రాకపోతే ప్రజా క్షేత్రంలోకి వెళ్లి తేల్చుకుంటామని బండి సంజయ్ తెలిపారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై వారం రోజులవుతున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో నిమజ్జన ఏర్పాట్లు చేయలేదన్నారు.నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయలేదన్నారు. ఇందుకు కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపుతున్నారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎంకు హిందూ పండుగలంటేనే షరతులు గుర్తుకొస్తాయన్నారు. ఇతర వర్గాల పండుగల విషయంలో ఇవేమీ పట్టవని బండి సంజయ్ విమర్శించారు. హిందువుల మధ్య గందరగోళం సృష్టించి ఆ పండుగలకు ప్రాధాన్యత లేకుండా చేసే కుట్ర చేస్తున్నారన్నారు.
also read:అసెంబ్లీ నుండి బయటకు పంపే ప్రయత్నం : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
హిందూ సమాజం సంఘటితం కాకుండా కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ తీరుకు నిరసనగా తక్షణమే గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన ఆందోళనలు విజయవంతమయ్యాయన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.