అసెంబ్లీ నుండి బయటకు పంపే ప్రయత్నం : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
అసెంబ్లీ నుండి ఏదో కారణంతో తమను బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు.ఈటల రాజేందర్ కు పంపే నోటీసును చట్టబద్దంగా ఎదుర్కొంటామని ఆయన చెప్పారు.
హైదరాబాద్: అసెంబ్లీ నుండి ఏదో కారణంతో తమను బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు..బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నాడు రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. బీఏసీ సమావేశానికి తమను ఆహ్వానించాలని పలుమార్లు స్పీకర్ ను కోరిన విషయాన్ని రఘునందన్ రావు గుర్తు చేశారు. గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్న వారిని కూడ బీఏసీ సమావేశానికి ఆహ్వానించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాలకు కూడ తమను రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అనుమానించారు. ఏ సంప్రదాయం ప్రకారంగా నోటీసులు ఇస్తారో చెప్పాలని కూడా రఘునందన్ రావు అడిగారు. అసెంబ్లీలో మైక్ లు విసిరినప్పుడు,గవర్నర్ కుర్చీని తన్నినప్పుడు సభలో సంప్రదాయాలు ఏమయ్యాయని కూడా ఆయన ప్రశ్నించారు.
మరమనిషి అనేది నిషేధిత పదమా అని రఘనందన్ రావు అడిగారు. స్పీకర్ ఇచ్చే నోటీసులను చట్టబద్దంగా ఎదుర్కొంటామని చెప్పారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారన్నారన్నారు.స్పీకర్ ను ప్రశ్నించడం తప్పా అని రఘునందన్ రావు అడిగారు. అసెంబ్లీలోని ఎమ్మెల్యేలందరికి ఒకే గౌరవం ఉండాలన్నారు. ఎమ్మెల్యేలు కుర్చీలు వెతుక్కునేలోపుగానే స్పీకర్ నిన్న అసెంబ్లీని వాయిదా వేశారని చెప్పారు. కోట్లాది రూపాయాలు ఖర్చు చేసి అసెంబ్లీ నిర్వహించడం ఇందుకోసమేనా అని ఆయన ప్రశ్నించారు.
also read:స్పీకర్ పై వ్యాఖ్యలు: బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు నోటీసులిచ్చే చాన్స్
ప్రజా సమస్యలపై చర్చించకుండానే సభను ఎలా వాయిదా వేస్తారని రఘునందన్ రావు అడిగారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే సభ నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు. .ఏకపక్ష పాలన కేసీఆర్ సర్కార్ కు మంచిది కాదన్నారు. తెలంగాణ అసెంబ్లీలో కొత్త సంప్రదాయాల కోసం ఏమైనా తీర్మానం చేశారా లేదా చెప్పాలని ఆయన అడిగారు. సంప్రదాయాన్ని పాటిస్తారా లేదా స్పీకర్ చెప్పాలన్నారు.
బీఏసీ సమావేశానికి తమను ఆహ్వానించకపోవడంపై ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషిగా నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.స్పీకర్ ను మరమనిషిగా నిర్ణయాలు తీసుకోవద్దని చేసిన వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.