హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుపై బిజెపి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తండ్రీకొడుకులు తెలంగాణను దోచుకుంటున్నారని ఆయన కేసీఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి అన్నారు. కుటుంబ పాలనతో తెలంగాణను లూటీ చేస్తున్నారని అన్నారు. 

తెలంగాణలో నిజాం సర్కార్ నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు తెలంగాణ సచివాలయంలో ఎవరూ ఊండరని ఆయన అవహేళన చేశారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాదులో శుక్రనవారం ఆయన పర్యటించారు. 

Also Read: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు: బండి సంజయ్, ఎర్రబెల్లి ఫైర్

తరుణ్ చుగ్ తో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాజాసింగ్,  బిజెపి నేత వివేక్ భేటీ అయ్యారు. నాగార్జున సాగర్ శాసనసభ స్థానం ఉప ఎన్నికలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 

Also Read: భాగ్యలక్ష్మి అమ్మవారికి బండి సంజయ్ మొక్కలు: అసదుద్దీన్ మీద ఫైర్

టీఆర్ఎస్ తో తమది డూప్ ఫైట్ కాదని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలు ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలన్నీ బయటపెడుతామని అన్నారు. టీఆర్ఎస్ తో తాము రెజ్లింగ్ కు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికల్లో బిెజెపి అనూహ్యమైన ఫలితాలు సాధించింది. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ను ఢీకొట్టింది. దీంతో బిజెపిలో ఊపు వచ్చింది.