హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాదు పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. కార్పోరేటర్లతో ఆయన అమ్మవారిని శుక్రవారం ఉదయం సందర్శించుకున్నారు. కార్పోరేటర్లతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. తమ పార్టీ కార్పోరేటర్లు హైదరాబాదు అభివృద్ధికి సహకరిస్తారని ఆయన చెప్పారు. 

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అసదుద్దీన్ ఎవరు అధికారంలో వారితో కలిసి ఉంటారని ఆయన చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో, చంద్రబాబుతో కలిసి ఉన్నారని, ఇప్పుడు కేసీఆర్ తో కలిసి ఉంటున్నారని ఆయన గుర్తు చేస్తూ హైదరాబాదు పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చెందలేదని ఆయన ప్రశ్నించారు. 

తాము ఎంఐఎం విముక్త హైదరాబాదు కోసం కృషి చేస్తామని సంజయ్ చెప్పారు. ఐదేళ్ల పాటు ఏ విధమైన ఒత్తిళ్లకు, ఇబ్బందులకు గురి కాకుండా తమ కార్పోరేటర్లు ప్రజా సేవ చేస్తారని ఆయన అన్నారు. హైదరాబాదు అభివృద్ధికి తమ కార్పోరేటర్లు సహకరిస్తారని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం తాము సహకరిస్తామని చెపెప్పారు. 

తాము ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. కేసీఆర్ సంకుచిత మైనారిటీ విధానాలను, మూర్ఖత్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తాము ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదని, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం ఎదుర్కుంటామని ఆయన చెప్పారు.