Asianet News TeluguAsianet News Telugu

సెప్టెంబర్ 17తో బిజెపి స్కెచ్: కేసీఆర్ కు చుక్కలు

సెప్టెంబర్ 17 ఏదైతే తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేస్తూ వస్తోందో, అదే రోజు అమిత్ షాను రప్పించి ఇక్కడ భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తోంది. 

BJP sketch with Telangana liberation day to fight against KCR
Author
Hyderabad, First Published Aug 9, 2019, 2:19 PM IST

ఆర్టికల్ 370 రద్దు తరువాత బిజెపి నయా జోష్ తో మనకు కనపడుతుంది.యావత్తు దేశంలో ప్రజల మూడ్ బిజెపికి అనుకూలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటినుండో తమ కాషాయ జెండాను తెలంగాణలాంటి రాష్ట్రాల్లో   రెపరెపలాడించాలని భావిస్తున్న బిజెపి శ్రేణులు, అందుకు తగ్గ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 17 ఏదైతే తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేస్తూ వస్తోందో, అదే రోజు అమిత్ షాను రప్పించి ఇక్కడ భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తోంది. 

సెప్టెంబర్ 17వ తేదీన విమోచనదినంగా పాటిస్తామని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సందర్భంగా చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు వెనకాడుతున్నారు. మజ్లీస్ తో దోస్తీ కారణంగానే సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా కేసీఆర్ నిర్వహించడానికి అంగీకరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఇదే గనుక జరిగితే, కెసిఆర్ ను ఇరకాటంలో పెట్టి తన మైలేజీని పెంచుకోవాలని చూస్తుంది బీజేపీ. ఒకపక్క ఇప్పటికే ఎంఐఎం తోని పొత్తును పదే పదే ప్రశ్నిస్తూ వస్తున్న బీజేపీ, ఇప్పుడు మరింత వాడిగా తన ప్రశ్నల వర్షాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉంది. ఆర్టికల్ 370 రద్దుకు కెసిఆర్ సహకరించడంతో, ఇప్పుడు ఇదే అంశం పైన తెరాస ను ఇబ్బంది పెట్టవచ్చు. కాశ్మీర్లో ఒకలా ఇక్కడ మరోలా ఎందుకని? ఏమిటి ఈ రెండు నాల్కల ధోరణి అని తెరాస ను నిలదీయవచ్చు. 

దేశంలో భావోద్వేగ పరిస్థితులు ఉన్న ప్రతిసారీ బీజేపీ గెలుస్తూ వస్తున్న విషయం మనందరికీ తెలియంది కాదు. అప్పుడు వాజపేయ్ ప్రభుత్వం కార్గిల్ అంశం వల్ల ఎలా లాభపడిందో, మొన్న పుల్వామా దాడి తరువాత మోడీ గెలుపు, ఇప్పుడేమో 370 రద్దుతో మరోమారు బీజేపీ అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయి. ఎలానైనా ఈ పరిస్థితులను పూర్తిస్థాయిలో సద్వినియోగపరుచుకొని ఇక్కడ పాగా వేయాలనేది బీజేపీ వ్యూహం. 

ఇప్పటికే తెలంగాణను మరో కర్ణాటక చేస్తాం, 2023లో అధికారం మాదే అని పదే పదే చెప్పే బీజేపీ ఆ దిశగా పావులను కదుపుతుంది. నిన్నటి మోడీ స్పీచ్ గనుక విన్నట్లైతే అంతర్లీనంగా ఓ విషయం ప్రస్ఫుటంగా అర్థమౌతుంది. ఎన్నో ఏళ్లతరబడి నుంచి ఉన్న డిమాండ్లను గత ప్రభుత్వాలు తీర్చడానికి ఏనాడూ కృషి చేయలేదు. ఇప్పుడు మేము ఆ బాటలో పయనించబోతున్నాము. ఈ 370 రద్దు అందులో భాగంగానే చేయడం జరిగిందని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే ఖచ్చితంగా సెప్టెంబర్17 విషయంలో బీజేపీ తీవ్ర స్థాయిలో కెసిఆర్ ను ఇరకాటంలో పెట్టడం తథ్యం. 

అంతేకాకుండా రానున్న రోజుల్లో అనేక సెన్సిటివ్ అంశాలను బీజేపీ తెర ముందుకు తేనుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ విషయం రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఉన్నదే. దాని పట్ల కెసిఆర్ ను ఇంకా ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అన్నిటికంటే పెద్ద బ్రహ్మాస్త్రం రామ మందిరం అంశాన్ని ముందుకు తెస్తే కెసిఆర్ కి ఎం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఒకపక్కనేమో ఎంఐఎం తోని దోస్తీ మరోపక్క రామమందిర అంశం. మొత్తంగా కెసిఆర్ పైకి గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ, తన సమస్యలు తనకు తెలియనివికావు.  

ఇప్పటికే తెలంగాణాలో కాంగ్రెస్ ను దెబ్బతీసి తామేదో సాధించామనుకుంటున్న కెసిఆర్ కు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ బలహీన పడడంతో, ప్రజలంతా కెసిఆర్ ను ఎదిరించే శక్తి బీజేపీకే ఉందని నమ్మారు. దానికి నిదర్శనం వారు గెల్చుకున్న 4 సీట్లు. అవి కూడా తెలంగాణ ఉద్యమకేంద్రాలైన ఉత్తర తెలంగాణలో. ఇప్పటికే కిషన్ రెడ్డికి హోమ్ శాఖ సహాయమంత్రి పదవిని ఇచ్చి తమ స్థానాన్ని తెలంగాణాలో సుస్థిరం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. 

తెలంగాణాలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య చీలినప్పుడు మాత్రమే తెరాస కు లాభం. కాకపోతే కాంగ్రెస్ ను బలహీనపరిచడం ద్వారా తమకు ఎదురుండదని కెసిఆర్ భావించినప్పటికీ, అది సెల్ఫ్ గోల్ అయ్యింది. బీజేపీ కేంద్రంలో కూడా అధికారంలో ఉండడం, కాంగ్రెస్ ఒక పద్ధతి పాడు లేకుండా, అగమ్య గోచరంగా నాయకత్వలేమితో పీకల్లోతు కష్టాల్లో ఉంది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఆశా జనకంగా లేకపోవడం, తెలంగాణలోనేమో కాంగ్రెస్ దాదాపుగా ఖాళి అయిపోవడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా బీజేపీ వైపు తరిలే ఛాన్స్ ఉంది. 

బీజేపీ ముఖ్య ఓటర్ బేస్ యువత. ఇప్పటికే హిందుత్వ భావజాలంతో యువతను ఏకం చేస్తున్న బీజేపీ కి యువతలో ముఖ్యంగా నిరుద్యోగుల్లో కెసిఆర్ పట్ల ఉన్న వ్యతిరేకత  కలిసివచ్చే అంశంగా కనపడుతుంది. 2023 నాటికి కెసిఆర్ కూడా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉంటాడు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా 2019కన్నా ఎక్కువగానే ఉంటది. ఇలాంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే బీజేపీ ఇక్కడ కాషాయ జెండాను ఎగురవేసే చాన్సులు అధికంగానే కనపడుతున్నాయి. 

2023 ఎన్నికల కన్నా ముందు తెలంగాణాలో ఉన్న మునిసిపల్ ఎన్నికల్లో, ముఖ్యంగా జి హెచ్ ఎం సి ఎన్నికల్లో ఎలానైనా తామే ప్రధాన ప్రతిపక్షం అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి బీజేపీ కృషిచేస్తుంది. మొత్తంగా మాత్రం రానున్న రోజుల్లో తెలంగాణాలో రాజకీయ వాతావరణం మాత్రం వేడెక్కడం తథ్యం. 

Follow Us:
Download App:
  • android
  • ios