Hyderabad: ఏఐఎంఐఎంకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన నిరసనతో పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పరిస్థితులు చేయిదాటకుండా పోలీసులు రంగప్రవేశం చేసి చర్యలు తీసుకున్నారు. బీజేపీ ఫిర్యాదు మేరకు కాలాపతేర్ పోలీసులు ఏఐఎంఐఎం కార్పొరేటర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
BJP protests against AIMIM: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని పాతబస్తీలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ చేపట్టిన నిరసనల మధ్య శాంతిభద్రతల సమస్యలు రాకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. బీజేపీ ఫిర్యాదు మేరకు కాలాపతేర్ పోలీసులు ఏఐఎంఐఎం కార్పొరేటర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వివరాల్లోకెళ్తే.. తమను సమావేశాలు నిర్వహించకుండా ఏఐఎంఐఎం నాయకులు అడ్డుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోపించింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకున్న ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలు గురువారం ధర్నాకు దిగారు. దీంతో మరోసారి పాతబస్తీలోని కాలాపతేర్‌లో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకు దిగిన బీజేపీ కార్యకర్తలు, పలువురు నాయకుల ఫిర్యాదు మేరకు కాలాపతేర్ పోలీసులు ఏఐఎంఐఎం కార్పొరేటర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాలాపతేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోచి కాలనీలో బీజేపీ స్థానిక విభాగం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ సమావేశం గురించి తెలుసుకున్న ఏఐఎంఐఎంకు చెందిన రాంనాస్‌పుర కార్పొరేటర్ మహ్మద్ ఖాదర్, ఇతర పార్టీ కార్యకర్తలతో కలిసి వచ్చి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య కొద్ది సమయం మాటల యుద్ధం నడిచింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలను పరిగణలోకి తీసుకుని ఇరు పార్టీల వారిని చెదరగొట్టారు.
మోచి కాలనీ వద్ద పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టిన తర్వాత బీజేపీ కార్యకర్తలు కాలాపతేర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఏఐఎంఐఎం కార్యకర్తలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. తమను అడ్డుకున్న వారిని వదిలేసి తమను పోలీసులు చెదరగొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పోలీసు స్టేషన్ వద్ద బీజేపీ కార్యకర్తలు పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు అదనపు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రాంత సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాలాపతేర్ మోచి కాలనీ, ఐటీఐ, పరిసర ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా పోలీసు పికెట్లు మోహరించారు.
