బీజేపీకి కొత్త సారథులు: తెలుగు రాష్ట్రాల్లో వీరి మధ్యే పోటీ
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సారధులను ఎంపిక చేసేందుకు కమల దళం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 25వ తేదీలోపుగా కొత్త అధ్యక్షులను ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త సారధుల ఎంపిక కోసం పార్టీ జాతీయ నాయకత్వం కసరత్తును ప్రారంభింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎంపీల మధ్య బీజేపీ చీఫ్ పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక ఏపీ రాష్ట్రంలో కూడ బీజేపీ అధ్యక్ష పదవికి కొత్త సారధిని ఎంపిక చేసే అవకాశం ఉంది.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అధికారం కోసం బీజేపీ ప్రణాళికలను సిద్దం చేసుకొంటుంది. ఈ మేరకు కొంత కాలంగా ఆ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ పదవీకాలం పూర్తైంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కొత్త సారధిని ఎంపిక చేసేందుకు జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది.
మాజీ మంత్రి డికె అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డితో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ల మధ్య ప్రధానమైన పోటీ నెలకొంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్రంలో నామినేట్ పదవిని కోరుకొంటున్నారు. ఒకవేళ నామినేట్ పదవి దక్కకపోతే బీజేపీ తెలంగాణ చీఫ్ పదవి కావాలని అరవింద్ పార్టీ నాయకత్వం వద్ద ప్రతిపాదించినట్టుగా సమాచారం.
మరో వైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవిని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడ కోరుకొంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ దూకుడును ఎదుర్కొనేందుకు దూకుడు స్వభావం ఉన్న నాయకత్వం కావాలని కమలదళం భావిస్తోంది. ఈ తరుణంలో కరీంనగర్ ఎంపీ సంజయ్ పేరు కూడ ఈ పదవి కోసం పరిశీలనలో ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
ఇక మాజీ మంత్రి డికె అరుణ పేరు కూడ ఈ పదవి కోసం విన్పిస్తోంది. బీజేపీ జాతీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్న మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి పేరు కూడ ఈ పదవి కోసం విన్పిస్తోంది.
గతంలో బీజేపీలో కీలకంగా వ్యవహరించిన జితేందర్ రెడ్డి తర్వాత టీడీపీ, టీఆర్ఎస్ లలో పనిచేశారు. ప్రస్తుతం బీజేపీలో చేరారు జితేందర్ రెడ్డి. మోడీ కూడ పేరు పెట్టి పిలవగల నేతగా జితేందర్ రెడ్డికి పేరుంది.
మరో వైపు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ ను కూడ మరోసారి ఈ పదవిలో కొనసాగించే అవకాశలు లేకపోలేదనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ ప్రచారాన్ని కొందరు నేతలు కొట్టిపారేస్తున్నారు. లక్ష్మణ్ కాకుండా ఇద్దరు ఎంపీలతో పాటు మాజీ మంత్రి పేరు కూడ జాతీయ నాయకత్వం పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారంలో ఉంది.
ఇక ఏపీ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలోకి రావాలని కమలదళం వ్యూహన్ని రచిస్తోంది. బీజేపీకి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ కొనసాగుతున్నారు. అయితే ఏపీ రాష్ట్రంలో కూడ బీజేపీ సారథిని మార్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
Aslo read:తెలంగాణలో మారుతున్న సీన్: టీఆర్‌ఎస్‌తో ఢీ అంటున్న బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఇలా..
ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌ల పేర్లతో పాటు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీ పేరు కూడ ప్రధానంగా విన్పిస్తోంది. ఏపీలో బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది.
అయితే సోము వీర్రాజు,మాధవ్, పురంధేశ్వరీలకు బదులుగా ప్రస్తుతం ఉన్న కన్నా లక్ష్మీనారాయణలను కొనసాగించే అవకాశాలు కూడ లేకపోలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ఈ నెల 25వ తేదీ నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ రాష్ట్ర శాఖలకు కొత్త నేతలను ఎంపిక చేసే అవకాశం ఉంటుందని సమాచారం.