ముఖ్యమంత్రి కేసీఆర్ ను తక్షణమే ఆ పదవి నుండి తొలగించాలని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ గవర్నర్ తమిళిసై ను కోరారు.  

హైదరాబాద్: గౌరవనీయమైన సీఎం పదవిని తన ఎడమకాలి చెప్పుతో సమానమని అవమానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను తక్షణమే ఆ పదవి నుండి తొలగించాలని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ గవర్నర్ తమిళిసై ను కోరారు. ఈ మేరకు అరవింద్ గవర్నర్ కు లేఖ రాశారు. 

''కేవలం సీఎం పదవిని అవమానించడమే కాకుండా ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ బెదిరించారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం, ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం ఎమ్మెల్యేల హక్కు. అలాంటిది వారిని పరుష పదజాలంతో దూషించడమేకాకుండా బెదిరింపులకు దిగిన కేసీఆర్ పై చర్యలు తీసుకోండి'' అని గవర్నర్ ను కోరారు అరవింద్. 

read more గిరిజనులపై చేయ్యేస్తే.. బిడ్డా: టీఆర్ఎస్ నేతలకు సంజయ్ వార్నింగ్

సోమవారం అరవింద్ మాట్లాడుతూ... టీఆర్‌ఎస్‌ పార్టీలో కేసీఆర్ పై విశ్వాసం సన్నగిల్లిందన్నారు. తన కుటుంబంపై కూడా ఎమ్మెల్యేల్లో నమ్మకం తగ్గిందని కేసీఆర్ గ్రహించారని... అందువల్లే సీఎం మార్పు వుండదని ప్రకటించారని అరవింద్ అన్నారు. 

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ మీటింగ్ లో సీఎం పదవిపై జరుగుతున్న డ్రామాలకు కేసీఆర్ తెరదించారన్నారు. ఎన్నికల్లో వరుస ఎదురుదెబ్బలతో పార్టీలో వ్యతిరేక గళం వినిపిస్తోందని... అందువల్లే కేసీఆర్ ఎమ్మెల్యేలపై బెదిరింపులకు దిగుతున్నారని అరవింద్ ఆరోపించారు.