కేంద్రం ప్రవేశపెట్టిన అగ్రకల్చర్ బిల్లులపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. ఆదివారం కేసీఆర్‌కు లేఖ రాసిన సంజయ్.. అగ్రికల్చర్ బిల్లు తేనే పూసిన కత్తిలాంటి చట్టమని విమర్శించటం అర్థరహితమని అన్నారు.

దేశంలోని గ్రామాలు ,పేద రైతుల సంక్షేమానికి ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని సంజయ్ అన్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఉద్దేశించిన చట్టంపై లేనిపోని అనుమానాలు కల్పిస్తూ రాష్ట్ర రైతుల్ని అయోమయానికి గురిచేయడం సమంజసం కాదన్నారు.

Also Read:తేనే పూసిన కత్తి: వ్యవసాయ బిల్లుపై కేసీఆర్ కామెంట్స్

ఆత్మనిర్బర్ భారత్‌‌లో భాగంగా కేంద్రం ఆధ్వర్యంలో వేలాది నూతన మార్కెట్లు వస్తున్నాయని సంజయ్ తెలిపారు. దీనిలో భాగంగా తెలంగాణలో నిర్మించే రైతు మార్కెట్లకు కేంద్రం నిధుల్ని సమకూరుస్తుందని ఎంపీ స్పష్టం చేశారు.

అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుడూ.. యాసంగిలో వడ్ల కొనుగోలు సందర్భంగా ఐకేపీ కేంద్రాల్లో వడగండ్ల వానకు నష్టపోయిన విషయం వాస్తవం కాదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. లాక్‌డౌన్ కాలంలో తెలంగాణలో పండ్లు కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో రైతులకు వ్యాపారులకు ఎంపిక స్వేచ్ఛతోపాటు పోటీతత్వంతో కూడిన ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాల ద్వారా గిట్టుబాటు ధరల లభ్యతకు వీలున్న వాతావరణాన్ని సృష్టించడమే రైతు ఉత్పత్తుల వాణిజ్య-వర్తక (ప్రోత్సాహం-సౌలభ్యం) బిల్లు-ప్రధాన లక్ష్యమని సంజయ్ తెలంగాణ రాష్ట్రప్రభుత్వానికి సూచించారు.