కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుతో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ బిల్లు కార్పోరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేలా ఉందని.. పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లును వ్యతిరేకించాలని ఎంపీ కేకేను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇది తేనే పూసిన కత్తి లాంటి బిల్లని, దీనిని ఖచ్చితంగా వ్యతిరేకించాలని కేసీఆర్ కోరారు. వ్యవసాయ బిల్లు, ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేలా వుందని సీఎం విమర్శించారు.

రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) బిల్లు (ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్, ఫెసిలిటేషన్), రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020 (ది ఫార్మర్స్ (ఎంపర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్లుతోపాటు నిత్యావసర సరకుల సవరణ బిల్లు (ది ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండమెంట్) బిల్లులను ఇటీవల లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే.

ఈ మూడు బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్, హరియాణాలలో ఈ ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా ఆగస్టులోనే పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేసింది.