హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో క్రైమ్ రేట్ తగ్గినట్లు పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ ప్రకటించారని... అయితే ఇలా చెప్పమని ఫాంహౌస్ లో కూర్చున్న పెద్దలు ఆదేశించి వుంటారని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. నగరంలో నేరాల నియంత్రణలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు.      

హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో గత ఆరునెలల కాలంలో నేరాల శాతం బాగా తగ్గిందన్న సిపి ప్రకటించారని... అయితే ఈ కాలంలో చోరీలు, హత్యలు, అత్యాచారాలు ఎన్ని జరిగాయో కూడా కమీషనర్ ప్రకటిస్తే బావుండేదన్నారు. గత నెల రోజుల్లో హైదరాబాద్ లో 6 హత్యలు జరిగాయని... గొడవలు, చోరీలు, చిన్న చిన్న నేరాలు చాలా జరిగాయని రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ నేరాలకు సంబంధించిన వివరాలను బయటపెట్టి అప్పుడు క్రైమ్ రేట్ తగ్గుదల గురించి మాట్లాడాలని అన్నారు. 

read more  కరోనా కట్టడికి... తెలంగాణకు కేంద్రం అందించిన సాయమిదే: కిషన్ రెడ్డి

 క్రైమ్ రేట్ తగ్గినట్లు సిపి ప్రకటించారా? లేక ఫాంహౌస్ పెద్దలు ఇలా ప్రకటించమని చెప్పారా? అని ప్రశ్నించారు. ఏదైమైనా నగరంలో నేరాల శాతం తగ్గిందన్న సిపి ప్రకటనలో ఎలాంటి నిజం లేదని రాజాసింగ్ పేర్కొన్నారు.