హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొవిడ్ -19 వ్యాధి వ్యాప్తి ప్రబలంగా ఉందని... మరణాల సంఖ్యలో కూడా రోజురోజుకు పెరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా, తెలుగు రాష్ట్రాల నుండి మంత్రిగా ఉన్నందున కరోనా విషయంలో ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో, ఇంకా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడుతున్నానని తెలిపారు. 

''మా పార్టీ కార్యకర్తలు, నాయకులు లక్షలాది మందికి ఆహారం, నిత్యావసరాలు పంపిణీ చేసి పేదవారిని ఆదుకున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వే హాస్పిటల్, ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీ, ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లలో కోవిడ్ టెస్టుల చెయ్యడం, పేషెంట్లకు ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేసి వారిని అండగా ఉంటున్నాం.  కరోనా మహమ్మారిని ఎదుర్కోవటం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర తరపున ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందుతున్నాయి'' అని వెల్లడించారు. 

''స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఇప్పటికే ఐదు సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అలాగే హోం శాఖ మంత్రి  అమిత్ షా పలు దఫాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రితో, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడారు.  కేంద్ర కేబినెట్ కార్యదర్శి, హోం శాఖ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తున్నారు'' అని తెలిపారు. 

''ఇటీవల కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించి వివిధ హాస్పిటల్ లను, ఎక్కువ కేస్ లు నమోదు అయిన బస్తీలను సందర్శించి, ప్రజలతో మాట్లాడి పరిస్థితిని అంచనా వేసింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏడు లక్షల 14 వేల N-95 మాస్కులను, రెండు లక్షల 41 వేల పిపిఈ కిట్లను అందించడం జరిగింది. ఇంకా 22 లక్షల 50 వేల హైడ్రాక్షి క్లోరోక్విన్ టాబ్లెట్లు ను తెలంగాణకు ఇవ్వడం జరిగింది'' అని అన్నారు.

read more    ఏపి బిజెపిపై కుట్రలు...కన్నా కూడా పసుపుదండులో భాగస్వామే?: విజయసాయి సంచలనం

''ముఖ్యంగా చాలా సందర్భాల్లో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉందని సామాజిక మాధ్యమాల్లో కొవిడ్ బాధితులు కోరుతున్నారు. ప్రత్యేకంగా ఈ అంశాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించి, వారిని వెంటిలేటర్లు ఇవ్వమని కోరటం జరిగింది. మొత్తం 1220 వెంటిలేటర్స్ ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. ఇప్పటికే 688 వెంటిలేటర్స్ తెలంగాణకు చేరాయి. కొవీడ్ టెస్టుల చెయ్యడానికి మొత్తం 36  లాబ్స్ కు అనుమతి ఇవ్వగా, అవి రాష్ట్రం లో  ఇప్పటికే పనిచేస్తున్నాయి'' అని తెలిపారు. 

''టెస్టింగ్ కిట్ల ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పెద్ద ఎత్తున తెప్పించుకుంటున్నాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి  ఆర్ఎన్‌ఎ ఎక్ట్రాక్షన్ కిట్ల కోసం ఒక లక్ష 22 వేల కోట్లను అందించడం జరిగింది. అలాగే RTPCR 2,90,427 కిట్ లను, 52 వేల VBM కిట్లను కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కావల్సిన అదనపు కిట్ లను కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను'' అన్నారు. 

''తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు కేంద్ర వైద్య శాఖ తరపున ₹215 కోట్ల ను వైద్య పరికరాల కొనుగోలు కోసం అందించాం. ఢిల్లీ లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండేది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధిక సంఖ్యలో టెస్టుల చేయడంతో పరిస్థితి కొంతవరకు అదుపులోకి వచ్చింది. అలాగే అనేక రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు చేస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తో కూడా ఈ అంశం గురించి మాట్లాడాను. తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రితో ఈ విషయం పైన మాట్లాడతానని హర్షవర్ధన్ చెప్పారు'' అని కిషన్ రెడ్డి వెల్లడించారు. 

''ముఖ్యంగా తెలంగాణలో పెద్ద ఎత్తున టెస్టులు నిర్వహించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. లాక్ డౌన్ కొత్తగా పెట్టుకోడానికి, కొత్త ప్రాంతాల్లో  విస్తరించడానికి,  కంటెన్మెంట్ జోన్స్ ఏర్పాటుకు పూర్తి స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మొత్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కావల్సిన సలహాలు, సూచనలు కేంద్రం అందిస్తుందని హర్షవర్ధన్ చెప్పారు. ఏ రకంగా కరోనా ను అరికట్టాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకోవాలి'' అని సూచించారు. 

''ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలాగా  కరోనా పరీక్షలు పూర్తి స్థాయిలో నిర్వహించాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. కంటెన్మెంట్ జొన్లలో నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరుతున్నాను. హైదరాబాద్ ప్రజలలో ఈరోజు భయం, ఆందోళన ఉన్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి  యుద్ద ప్రాతిపదికన కరోనా ను నివారించే, అరికట్టే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఈ విషయం లో కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని మంత్రి హర్షవర్ధన్ స్వయంగా చెప్పారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కి కూడా చెప్పాను'' అని అన్నారు. 

''టెస్టుల సంఖ్య పెంచడం, ప్రత్యేక బెడ్ల ను ఏర్పాటు చెయ్యడం అత్యవసరం. కంటైన్మెంట్ జోన్ లలో కఠిన నిబంధనల అమలు, మాస్కుల ను ధరించెట్లు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ లాక్ డౌన్ స్ఫూర్తిని కొనసాగించాలి. ప్రైవేట్ హాస్పిటల్ లలో లక్షల్లో ఫీజులు వసూలు చెయ్యడం మీద కూడా దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న వెంటిలేటర్స్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించి పేద ప్రజలకు అండగా ఉండాలి. అవసరం అయితే ఢిల్లీ తరహాలో  పదివేల పడకల ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ముందున్న ముఖ్య అంశం రాష్ట్ర ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడం. ప్రస్తుతానికి మిగతా విషయాలు పక్కన పెట్టి ఈ అంశం పైన అధిక దృష్టి పెట్టాలి'' అని కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.