హైదరాబాద్: తనకు ఎవరి నుండి ప్రాణ హాని ఉందో పోలీసులు స్పష్టంగా తెలపాని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలోనే తిరగాలని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఎవరితో తనకు ప్రాణహాని ఉందో చెప్పాలని హోంమంత్రి మహమూద్ అలీని ప్రశ్నించారు.

ఉగ్రవాదుల నుండి ముప్పు ఉంది.. జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కు  హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ ఈ నెల 24వ తేదీన లేఖ రాశారు. డీసీపీ స్థాయి అధికారి భద్రత కల్పిస్తారని సీపీ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్  లేఖ రాశాడు. తన నియోజకవర్గంలో ఎక్కువగా మురికివాడలే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. బైక్ పైనే తిరుగుతానని ఆయన చెప్పారు. స్థానికంగా ముప్పుందా ఇతర ప్రాంతాల నుండి ముప్పుందా అనే విషయాన్ని చెప్పాలని ఆయన కోరారు. 

మరో వైపు రెండేళ్ల నుండి  తన గన్ లైసెన్స్ కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ లో ఉందన్నారు. దీన్ని త్వరలోనే అప్ డేట్ చేయాలని ఆయన కోరారు. మొహర్రం సందర్భంగా ర్యాలీకి ఎలా అనుమతిచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. గణేష్ ఉత్సవాలకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో చెప్పాలన్నారు.