సచివాలయ కూల్చివేత నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరో 50 ఏళ్లు పనిచేసే పాత సచివాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా కూల్చివేస్తోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ పేరు ప్రతిష్టల కోసమే కొత్త సచివాలయ భవన నిర్మాణాన్ని తలపెట్టారని రాజాసింగ్ విమర్శించారు.

మంగళవారం ఓ వీడియోను మీడియాకు విడుదల చేసిన ఆయన.. నిజాం కాలంలో కట్టిన కట్టడాల వల్ల ఆయన పేరు ఇంకా వినబడుతోందని ఇప్పుడు అదే విధంగా తన పేరు కూడా తరతరాలు వినపడాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మిస్తున్నారని రాజాసింగ్ ధ్వజమెత్తారు.

Also Read:తెలంగాణ సచివాలయం కూల్చివేత: హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

పాత సచివాలయం కూల్చి కొత్త సచివాలయం కట్టడానికి ప్లాన్ వేశారని.. ఆ కొత్త సెక్రటేరియేట్ డిజైన్‌ని ఏఐఎంఐఎం వాళ్లు ఇచ్చి వుంటారా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కొత్త సచివాలయ నమూనా మసీదు, హజ్ హౌస్‌లను తలపిస్తోందని రాజాసింగ్ ఎద్దేవా చేశారు.

గుడి, మసీదు, హజ్ హౌస్‌లు ప్రతిబింబించేలా కాకుండా కొత్త సచివాలయాన్ని వినూత్నంగా నిర్మించేలా ప్రణాళిక రూపొందించాలని ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రి ఈ డిజైన్‌ను ఎంపిక చేసి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని రాజాసింగ్ నిలదీశారు.

సెక్రటేరియేట్ నిర్మించే సొమ్ము తన సొంత సొమ్ము కాదని, అది ప్రజలదనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని ఆయన ధ్వజమెత్తారు. కాగా పాత సచివాలయ భవనం కూల్చివేతకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read:కొత్త సచివాలయానికి హైటెక్ హంగులు: 100 ఏళ్లు పనిచేసేలా కేసీఆర్ ప్లాన్, ప్రత్యేకతలివే..!!

న్యాయస్థానం అనుమతితో సోమవారం అర్థరాత్రి నుంచి సచివాలయ కూల్చివేత పనులను వేగవంతం సర్కార్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే పోలీసులను భారీగా మోహరించి ట్యాంక్‌బండ్, మింట్ కాంపౌండ్ దారులను మూసివేశారు.

132 ఏళ్ల చరిత్ర కలిగిన సచివాలయం నిజాం కాలంలో సైఫాబాద్ ప్యాలెస్‌ పేరుతో ప్రసిద్ధి చెందింది. దీనిని కేంద్రంగా చేసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రులు పాలన కొనసాగించారు.