హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని కోరుతూ బుధవారం నాడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని  ఆయన ఆ పిటిషన్ లో ఆరోపించారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

సచివాలయం భవనాల కూల్చివేత కారణంగా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోందని, 5 లక్షల మంది పీల్చే గాలి కలుషితమయ్యే అవకాశం ఉందని పిటిషనర్ ఆరోపించారు. మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిబంధనలను కూడ పట్టించుకోకుండా ఈ భవనాలు కూల్చివేస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. 

సచివాలయంలో ఏ, బీ, సీ, డీ, జీ, జే, కే, ఎల్, నార్త్‌ హెచ్, సౌత్‌ హెచ్‌ బ్లాకులున్నాయి. మంగళవారం నాడు సీ, హెచ్, జీ బ్లాకులతో పాటు సచివాలయం పక్కన ఉన్న రాతిభవనం కూల్చివేశారు. ఇవాళ కూడ. కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.
 
ఇదే స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. కొత్త సచివాలయానికి సంబంధించిన డిజైన్లను కూడ సిద్దం చేశారు. ఈ డిజైన్లకు సీఎం ఆమోదం తెలపాల్సి ఉంది.