బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శుక్రవారం ఈడీ ఆఫీసుకు వెళ్లారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై వెలుగులోకి వచ్చిన ఆడియోపై ఆయన ఫిర్యాదు చేసే అవకాశం వుంది. అంతకుముందు మొయినాబాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల ప్రలోభాలకు తమకు సంబంధం లేదని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రమాణం చేశారు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ- టీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శుక్రవారం ఈడీ ఆఫీసుకు వెళ్లారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై వెలుగులోకి వచ్చిన ఆడియోపై ఆయన ఫిర్యాదు చేసే అవకాశం వుంది.
మరోవైపు.. మొయినాబాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల ప్రలోభాలకు తమకు సంబంధం లేదని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ శుక్రవారం నాడు ప్రమాణం చేశారు. ఇవాళ ఉదయం మర్రిగూడ నుండి బండి సంజయ్ యాదాద్రి ఆలయానికి బయలు దేరారు. మధ్యాహ్నానికి యాదాద్రికి చేరుకున్నారు.
ALso REad:ఎవరెవరు వస్తారో చెప్పండి:పైలెట్ రోహిత్ రెడ్డి, రామచంద్రభారతి ఆడియో సంభాషణ
సీఎం కేసీఆర్ ను కూడ ప్రమాణం చేసేందుకు రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. అయితే ఈ అంశానికి సంబంధించి టీఆర్ఎస్ నుండి ఎలాంటి స్పందన రాని విషయాన్ని కూడా బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. యాదాద్రికి చేరుకున్న బండి సంజయ్ స్నానం చేసి తడిబట్టలతో ఆలయంలో మూల విరాట్టును దర్శించుకున్నారు. అక్కడి నుండి నేరుగా స్వామివారి పాదాల వద్ద ప్రమాణం చేశారు. మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలు గురిచేశామని తమపై టీఆర్ఎస్ చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది.
ఇకపోతే.. ఎమ్మెల్యేలకు ప్రలోభాల అంశానికి సంబంధించి రామచంద్ర భారతి పైలెట్ రోహిత్ రెడ్డి మధ్య జరిగిన ఆడియో సంభాషణను ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ శుక్రవారం నాడు ప్రసారం చేసింది. ఈ నెల 26న ఫాంహౌస్ మీటింగ్‌కు ముందే ఈ సంభాషణ జరిగిందని ఆ కథనంలో పేర్కొంది. ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని రామచంద్రభారతి కోరినట్లుగా ఆడియో సంభాషణలో ఉంది. తన వద్ద నందకుమార్ ఈ అంశం ప్రతిపాదించినట్టుగా చెప్పారు. సమావేశానికి హైద్రాబాద్ మంచి ప్లేస్ అని రోహిత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల నిఘా ఉందని రోహిత్ రెడ్డి రామచంద్రభారతికి చెప్పారు. తనతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని రోహిత్ రెడ్డి రామచంద్రభారతితో అన్నట్టుగా ఆడియోలో ఉంది.
