తెలంగాణ కోసం పోరాడి శతృవుగా మారా: విజయశాంతి
తెలంగాణ కోసం పోరాటం చేసి తాను అందరికీ శత్రువుగా మారినట్టుగా సినీ నటి విజయశాంతి చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ కోసం పోరాడుతూ అందరికీ శతృువు గా మారానని సినీ నటి, బీజేపీ నేత విజయశాంతి చెప్పారు. రాజకీయాల్లో చేరి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా శుక్రవారం నాడు హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. కేసీఆర్ మాటలకు మోసోవద్దని విజయశాంతి కోరారు. 1998 జనవరి 26 అద్వానీ, వాజ్ పేయ్ ఆధ్వర్యంలో బీజేపీ లో చేరినట్టుగా ఆమె చెప్పారు. అవినీతి లేని క్రమశిక్షణ గల పార్టీ అనే బీజేపీ లో చేరినట్టుగా ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనేది తనకు చిన్నప్పటి నుంచి కోరికగా ఆమె వివరించారు. 43ఏళ్లుగా సినిమా పరిశ్రమ లో పనిచేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. విద్యాసాగర్ రావు, వెంకయ్య నాయుడు లు తనను బీజేపీ లో చేరమని అడిగిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ కోసం మొదటి నుంచి పోరాటం చేసింది బీజేపీయేనన్నారు. సోనియా గాంధీ కి వ్యతిరేకంగా పోటీ చేయమని అద్వానీ కోరినట్టుగా చెప్పారు. కష్టాలైనా , నష్టాలైనా ఇబ్బందులు, వెన్ను పోటు ఉన్నా పోరాడుతూ వచ్చినట్టుగా విజయశాంతి వివరించారు. తెలంగాణ వాదం వదులుకుంటే తనకు ఎన్నో పదవులు వచ్చేవన్నారు. తెలంగాణ కోసమే గతంలో తాను బీజేపీ నుంచి బయటకు వచ్చినట్టుగా విజయశాంతి ప్రస్తావించారు. ఎంతో బాధతో తాను అప్పట్లో బీజేపీ నుంచి బయటకు వచ్చానని విజయశాంతి వివరించారు.
తెలంగాణ సమస్యలపై పోరాడుతుంటే కేసీఆర్ అనే రాక్షసుడు ఎంటరయ్యాడని ఆమె విమర్శించారు. ఆ సమయంలో తాను బీఆర్ఎస్ లో చేరినట్టుగా తెలిపారు. యూపీఏ లో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవిని తీసుకున్న సమయంలో తాను ఆయనను నిలదీసినట్టుగా విజయశాంతి వివరించారు. మెదక్ లో ఎంపీ గా టికెట్ ఇచ్చి తనను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేశారని విజయశాంతి ఆరోపించారు. ఆ తర్వాత అకారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు.
తెలంగాణ బిల్లు రోజున తనను పోడియం వద్దకు పంపించి కేసీఆర్ పార్లమెంట్ నుండి జారుకున్నారని విజయశాంతి విమర్శించారు. అందమైన తెలంగాణ రాష్ట్రం అసమర్దుడి చేతిలోకి వెళ్ళిందన్నారు. బీజేపీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. కేసీఆర్ ను అధికారంలో నుండి దింపడానికి అంతా కలిసి పనిచేద్దామని ఆమె బీజేపీ నేతలను కోరారు. ఇదొక్కసారి కష్టపడితే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ లో మరోసారి కేసీఆర్ కు అధికారం ఇస్తే ఎవరు బతకరని ఆమె అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అనే వ్యక్తి ఒక విషసర్పం లాంటొడన్నారు. అందరినీ చాపకింద నీరులా చంపేస్తుంటాడని ఆమె చెప్పారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే ఏ పెన్షన్లు ఇవ్వడన్నారు.