Asianet News TeluguAsianet News Telugu

ఈటల రాజేందర్‌కు తరుణ్ చుగ్ అభినందనలు.. ఈటలకు పార్టీలో కీలక పదవి?

హుజురాబాద్ ఉపఎన్నికలో విజయం సాధించిన ఈటల రాజేందర్‌ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ అభినందించారు. ఈ రోజు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్మానించారు. ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన ఈటలకు కీలక పదవి ఇచ్చే యోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

bjp leader tarun chug wishes etela rajender on his win in huzurabad
Author
Hyderabad, First Published Nov 9, 2021, 4:44 PM IST

హైదరాబాద్: Huzurabad Bypollలో ఘన విజయం సాధించిన Etela Rajenderను తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ Tarun Chug అభినందించారు. ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపొందిన తర్వాత తరుణ్ చుగ్ తొలిసారిగా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈటలను అభినందించారు. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తరుణ్ చుగ్, ఈటల రాజేందర్, మరికొందరు బీజేపీ ముఖ్య నేతలు ఉన్నారు. అనంతరం BJP రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ తరుణ్ చుగ్ సారథ్యంలో ఈటల రాజేందర్‌ను బీజేపీ నేతలు సన్మానించారు.

హుజురాబాద్ ఉపఎన్నికను ఈటల రాజేందర్, TRS, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణలో బలపడటానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్న బీజేపీ హుజురాబాద్‌లో గెలుపొంది తీరాలని భావించింది. అధికార టీఆర్ఎస్‌పైనే తిరుగుబాటు జెండా ఎగరేసి మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌కు ఈ ఉపఎన్నిక చావో రేవో అన్నట్టుగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఉపఎన్నికలో విజయం సాధించి పార్టీ శ్రేణుల్లో మరింత ఆత్మ విశ్వాసాన్ని పెంచాలని టీఆర్ఎస్ యోచించింది. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు విస్తృత ప్రచారం చేశారు. అయినప్పటికీ ఓటమి తప్పలేదు. ఈటల రాజేందర్ విజయం సాధించారు.

Also Read: ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణల కేసు.. ఈ నెల 16న విచారణ..

ఈ గెలుపు తర్వాత ఈటల రాజేందర్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు యోచిస్తున్నారు. టీఆర్ఎస్ టార్గెట్‌గా ఆ పర్యటన ఉండాలని సమాలోచిస్తున్నట్టు సమాచారం.

తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఉన్న టీఆర్ఎస్‌కు ముచ్చెమటలు పట్టించి విజయ తీరానికి చేరిన ఈటల రాజేందర్‌కు పార్టీలో కీలక పదవి(Key Position) ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. టీఆర్ఎస్‌ను ఢీకొట్టిన రాజేందర్‌ను సరిగ్గా వినియోగించి బీజేపీని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని బీజేపీ నాయకత్వం ఆలోచనలు చేస్తున్నట్టు టాక్ నడుస్తున్నది. మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతున్న నేతల మనోభావాలు దెబ్బతినకుండా, వారిని తక్కువ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈటలకు ఓ కీలక పదవి ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. టీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కొన్న ఈటలను క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్‌గా నియమించాలని యోచిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది. అంతేకాదు, బెయిల్ పై విడుదలైన తీన్మార్ మల్లన్నకు ఓ పదవి దక్కే అవకాశముందని చర్చ.

Also Read: కళ్లు నెత్తికెక్కాయా, టచ్ చేసి చూడు.. బిడ్డా బతుకుతావా: బండి సంజయ్‌కి కేసీఆర్ వార్నింగ్

తెలంగాణ ఉద్యమ సమయం మొదలు అనంతరం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈటల రాజేందర్‌కు విశేష ఆదరణ ఉన్నది. అన్ని వర్గాలతో సత్సంబంధాలున్నాయి. దాదాపు అన్ని పార్టీల నేతలతోనూ సఖ్యత ఉన్నది. పెద్ద నేతలు మొదలు.. చిన్న.. చిన్న నేతల వరకూ పరిచయాలున్నాయి. ఆయన తలుచుకుంటే బీజేపీలోకి పలువురు కీలక నేతలను తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే ఆయనకు కీలక పదవి ఇచ్చి రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడాలనే యోచన చేస్తున్నట్టు సమాచారం. పార్టీలో ఈటల రాజేందర్‌కు కీలక పదవి ఇస్తే ఇతర పార్టీల నుంచి పెద్ద మొత్తంలో నేతలను బీజేపీలోకి తెచ్చుకోవచ్చని ఆలోచిస్తున్నట్టు రాజకీయవర్గాలు చర్చిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios