బిజెపికి షాకిచ్చిన బిసి నేత... నేడు కేటీఆర్ సమక్షంలో కారెక్కేందుకు సిద్దం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిసి నినాదం ఎత్తుకున్న బిజెెపికి అదే బిసి సామాజికవర్గానికి నేతలు షాక్ ఇస్తున్నారు. తాజాగా మరో బిసి నేత బిజెపిని వీడి బిఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమయ్యారు.
హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటున్న బిజెపి అసెంబ్లీ ఎన్నికల వేళ మాత్రం ఆపసోపాలు పడుతోంది. తెలంగాణ బిజెపిలో మంచి ఊపు తీసుకువచ్చిన బండి సంజయ్ ను అద్యక్ష పదవినుండి తొలగించిన తర్వాతే ఆ లు సమస్య మొదలయ్యింది. ఆయన తొలగింపు తర్వాత మొదలైన రాజీనామాల పర్వం అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా కొనసాగుతోంది. బిజెపి గెలుపుపై నమ్మకంలేక కొందరు పార్టీని వీడుతుంటే... టికెట్ దక్కక మరికొందరు... ఇతర పార్టీలు మంచి అవకాశం ఇస్తామంటే మరికొందరు కాషాయం పార్టీని వీడుతున్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో కీలక నాయకుడు బిజెపికి గుడ్ బై చెప్పి కారెక్కేందుకు సిద్దమయ్యాడు.
ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు పల్లపు గోవర్దన్ బిజెపికి రాజీనామా చేసాడు. వెంటనే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆయనను బిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. దీంతో గోవర్దన్ ఇవాళ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరనున్నారు. వడ్డెర సామాజికవర్గానికి చెందిన గోవర్దన్ రాజీనామా హైదరాబాద్ బిజెపికి పెద్ద ఎదురుదెబ్బే.
ఇదిలావుంటే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాసిన రాజీనామ లేఖలో పల్లపు గోవర్దన్ తన ఆవేదనను వెల్లబుచ్చాడు. తనలాగ నిజాయితీ, నిస్వార్థంతో పార్టీకోసం కష్టపడే నాయకులకు బిజెపిలో చోటులేదని అర్థం అవుతుందున్నాడు. హిందూధర్మం కోసం తపించే తనలాంటి యువకులకు బిజెపి అండగా వుంటుందని ఎంతగానో నమ్మానని గోవర్దన్ పేర్కొన్నాడు.
Read More Telangana Assembly Elections 2023 : బిజెపి బిసి సీఎం అభ్యర్థి ఆయనేనా?
బిజెపిలో తనలాంటి యువతకు, బిసి నాయకులకు భవిష్యత్ లేదని తాజాగా అర్థమయ్యిందని పల్లపు ఆరోపించాడు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బిసిని సీఎం చేస్తామని ప్రకటించారు... కానీ ఎన్నికల్లో గెలిచే దమ్ము, సత్తా వున్న తనలాంటి యువ నాయకుల తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నాడు. టికెట్ ఇవ్వకపోగా కనీసం పిలిచి మాట్లాడే సంస్కారం కూడా బిజెపిలో లేదని అన్నాడు. అందుకే ఇక తన ఆత్మగౌరవాన్ని తగ్గించుకోలేక పార్టీని వీడుతున్నానని అన్నాడు. 22 ఏళ్ళపాటు తల్లిలా భావించి ఎంతో ప్రేమించిన బిజెపిని వీడటం బాధగానే వున్నా తప్పట్లేదని గోవర్దన్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
బిజెపిని వీడిన గోవర్దన్ నేడు బిఆర్ఎస్ లో చేరనున్నారు. తెలంగాణ భవన్ లో ఆయన చేరిక కార్యక్రమం జరగనుంది. తన అనుచరులతో పాటు మరికొందరు బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తెలంగాణ భవన్ కు చేరుకుని బిఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు పల్లపు గోవర్దన్.