తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానంటూ వైఎస్ షర్మిల.. ఖమ్మం సభలో పేర్కొన్న సంగతి  తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాజన్న రాజ్యమంటే దాచుకోవడం.. దోచుకోవడమేగా అంటూ బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ ఎద్దేవా చేశారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది రాజన్న రాజ్యమేనని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాజన్న రాజ్యంలోనే ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు కోర్టుల చుట్టూ తిరిగారని గుర్తుచేశారు. షర్మిల ప్రసంగం సీఎం కేసీఆర్ రాసి ఇచ్చిందేనని తీవ్రమైన విమర్శలు చేశారు. లక్ష మందితో టీఆర్‌ఎస్‌ సభ నిర్వహిస్తామంటుంటే అనుమతి ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. నాగార్జున సాగర్‌లో విచ్చలవిడిగా మద్యం పంచుతున్నారని ప్రభాకర్‌ ఆరోపించారు.

శుక్రవారం ఖమ్మం సంకల్ప సభలో షర్మిల మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ మాటలు చెప్పడం తప్ప చేతల్లో ఏదీ చూపడం లేదని ఎద్దేవాచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేదని, తెలంగాణకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదంటూ ధ్వజమెత్తారు. సింహం సింగిల్‌గానే వస్తుందని, తాను టీఆర్‌ఎస్‌ చెబితేనో, బీజేపీ అడిగితేనే, కాంగ్రెస్‌ పంపిస్తేనో రాలేదని స్పష్టం చేశారు. తాను రాజన్న బిడ్డనని, ఎవరి కింద పనిచేయనని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోనన్నారు. తమ పార్టీలో నేటి కార్యకర్తలే రేపటి నాయకులని షర్మిల చెప్పారు. 

ఇదిలా ఉండగా వైఎస్ షర్మిల తెలంగాణలో యాక్టివ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శుక్రవారం ఖమ్మంలో పెట్టిన సభలోనే పార్టీ పేరు ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే.. జులై లో తాను పార్టీ పేరు ప్రకటిస్తానని ఆమె చెప్పారు. తాను కేసీఆర్ ని టార్గెట్ చేశానని.. ఆమె స్పష్టం చేశారు. ఈ  సభకు షర్మిలతోపాటు.. ఆమె తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు. తన కూతురిని ఆదరించాలని ఆమె కూడా తెలంగాణ ప్రజలను కోరారు.