హైదరాబాద్:  భారత్ బయోటెక్ సంస్థలో కరోనా వ్యాక్సిన్ కోసం జరుగుతున్న ప్రయత్నాలను స్వయంగా పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే హైదరాబాద్ కు విచ్చేసిన విషయం తెలిసిందే. సహజంగా ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు విమానాశ్రయం వద్దే రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. అయితే ఈసారి అలా కాకుండా ప్రధాని నగర పర్యటనలో సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం అందలేదు. 

తెలంగాణ సీఎంను అవమానించడానికే ప్రదాని ఇలా చేశాడంటూ టిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జీహెచ్ఎంసి సమయంలో తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిందంటూ నగర ప్రజల ముందు బిజెపిని విలన్ గా చూపే ప్రయత్నాన్ని టీఆర్ఎస్ చేస్తోంది. దీన్ని పసిగట్టిన బిజెపి సీనియర్ నాయకులు లక్ష్మణ్ అసలు ప్రధాని పర్యటనకు ముఖ్యమంత్రిని దూరంగా వుంచడానికి వెనకున్న కారణాన్ని వివరించారు. 

ప్రధానమంత్రి కేవలం కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియను పరిశీలించడానికి మాత్రమే నగరానికి విచ్చేశారన్నారు. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తన పర్యటన ఎలాంటి రాజకీయ చర్చకు దారితీయకుండా వుండేందుకే ప్రధాని ఈ నిర్ణయం తీసుకునివుంటారన్నారు. అంతేకాని సీఎంను అవమానించాలని కాదని... అయినా పీఎం టూర్‌లో సీఎం పాల్గొనే విషయం యావత్ తెలంగాణ ఆత్మగౌరవ అంశం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా ప్రధాని పర్యటనకు వెళ్లడం లేదని ఈ సందర్బంగా లక్ష్మణ్ గుర్తుచేశారు. 

ఇదిలావుంటే ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితమే హకీంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ప్రధానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, సైబరాబాద్ సిపి సజ్జన్నార్, ఎయిర్ ఫోర్స్ అధికారులు స్వాగతం పలికారు.