సంజయ్ టెర్రరిస్టా, నక్సలైటా..? ఇంత దారుణంగా అరెస్టా? : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

తెలంగాణ బిజెెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేసారు. 

BJP Leader Konda Visweshwar Reddy Serious on Bandi Sanjay Arrest AKP

హైదరాబాద్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేయడంపై మాజీ ఎంపీ, బిజెపి నాయకులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ చేసారంటూ అర్ధరాత్రి ఓ ఎంపీని ఎటువంటి నోటీసులు, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఏనాడో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని... నిన్న(మంగళవారం) రాత్రి సంజయ్ అరెస్టుతో అది మరోసారి రుజువయ్యిందని విశ్వేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు.

అర్ధరాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్ ఇంటికి వెళ్లి టెర్రరిస్ట్, నక్సలైట్ లా పోలీసులతో అరెస్ట్ చేయిస్తారా? ఏ కారణం చెప్పకుండానే అరెస్ట్ చెయ్యడం హేయమైన చర్యగా విశ్వేశ్వర్ రెడ్డి అభివర్ణించారు. ప్రశ్నించిన ప్రతిసారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తామని బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిరూపించిందని అన్నారు. బహుశా తెలంగాణ పోలీసుల కోసం కేసీఆర్ సర్కార్ కొత్త పీనల్ కోడ్ అమలు చేస్తుందేమో అంటూ ఎద్దేవా చేసారు. 

పదో తరగతి పేపర్ల లీకేజీతో బండి సంజయ్ కు ఏం సంబంధం? ఆయన అరెస్ట్ ఎందుకు? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తున్న పరీక్ష పత్రాల లీకేజీతో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినందుకేనా? లేక నిన్న మొన్న టెన్త్ తెలుగు, హిందీ పేపర్ లీకేజీపై ప్రశ్నించినందుకా? అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. 

Read More  టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజి కేసు... బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ కూడా అరెస్ట్

బిఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థ, అన్యాయ, అక్రమ పాలనలో వరుసగా ఒక్కొక్క పరీక్ష పేపర్ లీకవుతుంటే ఆగమైతున్న విద్యార్థుల పక్షాన నిలబడి ప్రశ్నించినందుకే బండి సంజయ్ అరెస్ట్ చేసారా అని విశ్వేశ్వర్ రెడ్డి నిలదీసారు. నిన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సదివిన ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ డిగ్రీని సూపెట్టమని అడిగినందుకా? ఎందుకు సంజయ్ అరెస్ట్ అని  తెలంగాణ ప్రజలు అడుగుతున్నారని అన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని నిరూపితమైందని ప్రజలు మాట్లాడుకుంటున్నారని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా నియంత విధానాలను వీడి వెంటనే బండి సంజయ్ ని విడుదల చెయ్యాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేసారు. తెలంగాణ నలుమూలల ప్రజల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి పాలనపై బిజెపి చేస్తున్న పోరాటం మరింత ఉదృతం చేస్తామని కొండా విశ్వేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. 

ఇక గత అర్ధరాత్రి బండి సంజయ్ అరెస్ట్ సమయంలో కరీంనగర్ లోని ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను.. తనను తీసుకెళ్లడానికి గల కారణమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. తన మీద ఏం కేసు ఉందని? వారెంట్ లేకుండా ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. అయితే పోలీసులు కారణం చెప్పకుండానే బండి సంజయ్‌ను ఆయన ఇంటి నుంచి బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలో బీజేపీ శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. అయితే ఈ ఉద్రిక్తతల మధ్యే బండి సంజయ్‌ను పోలీసు వాహనంలోకి ఎక్కించిన పోలీసులు.. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాజాగా అక్కడినుండి పోలీస్ వాహనంలో ఇంకెక్కడికో తరలిస్తున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios