బీజేపీ నేత డీకే అరుణ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసుల మీద స్పందించారు. ఇది కక్ష సాధింపు చర్య కాదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఆమె ఒక్కతే కాదు అన్నారు. 

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందడం మీద బీజేపీ నేత డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ ఆత్మగౌరవం అంటే కవితగారు ఒక్కరేనా.. తెలంగాణలో ఉన్నది ఆమె ఒక్కరేనా ఏందీ...’ అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్య కాదని అన్నారు. లిక్కర్ స్కాంలో ఉన్న మిగతా అందరితో పాటూ కవిత కూడా ఒకరని, కల్వకుంట్ల కవిత ఏమీ స్పెషల్ కాదు అన్నారు. ఢిల్లీ మధ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరికీ ఇచ్చినట్టే కవితకు నోటీసులు ఇచ్చారన్నారు.

ఇది కక్షసాధింపు చర్య అని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. వారు తమ నాయకుడు కేసీఆర్ ను ఖుషీ చేయాలి కాబట్టి అలా మాట్లాడుతున్నారని, వారికి అది తప్పదు కదా అన్నారు. కక్ష సాధింపు అనేది లేదని.. ఇది అలాం చర్య కాదుని అన్నారు. టీఆర్ ఎస్ వారికి కక్ష సాధింపులు అలవాటు. వారు కక్ష సాధింపు లతోనే తెలంగాణను పాలిస్తున్నారు కాబట్టి.. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు వారికి కూడా ఇది అలాగే కనిపిస్తుంది అన్నారు. 

దీనిమీద ఇప్పుడు తానేం మాట్లడనని.. ‘అంతా తేలినంక మాట్లాడదాం.. ఈడీ పిలిచింది. తనేం మాట్లాడుతుందో...ఏం చెబుతుందో.. వారేమంటారు.. ఏం తెలుతుందో.. ఆ తరువాత మాట్లాడదాం’ అన్నారు. ఇక ఈ సందర్భంగా డీకే అరుణ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అంతకు ముందు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు రావడంపై గిరిజనసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అభినందనలు తెలపాల్సింది పోయి.. ఇలా బిహేవ్ చేయడం బీజేపీ కేంద్ర ప్రభుత్వానికే చెల్లిందన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎంత ప్రయత్నించినా, ఎంత వేధించాలని చూసినా కవిత భయపడదన్నారు.

కవిత ఇంటి వైపు వెళ్లే దారుల మూసివేత: భారీ బందో బస్తు

ఆమెను మీ కేసులు, సమన్లు ఏం చేయలేవన్నారు. కవిత చాలా గట్టిందని తెలిపారు. దేనికీ భయపడదని.. కేసులు పెట్టి అణిచివేయాలని చూస్తే అది మీ విఫల ప్రయత్నమే అని అన్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోచుకున్న అదానీ, ప్రధానితో కుమ్మక్యతై ఏమీ లేదు కానీ.. వందకోట్ల రూ. స్కాం అనే అనుమానం పేరుతో కవితను వేధించడం ఖండిస్తున్నాం. ఈడీ నోటీసులు, సమన్లు ఇవ్వడం అన్యాయం అన్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

కాగా, ఈడీ నోటీసుల మీద ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈడీకి అన్నిరకాలుగా తాను సహకరిస్తానని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం కవితకు ఈడీ నోటీసులు అందిన సంగతి తెలిసిందే. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని కోరారు. 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఉన్నందున తాను హాజరు కాలేనని తెలిపారామె. కానీ, అది ఎల్లుండి కాబట్టి, రేపు హాజరు కావాలని ఈడీ అధికారులు అన్నట్లు సమాచారం. ఈ క్రమంలో తనకు ఈడీ నోటీసులు అందినట్లు కవిత ఒప్పుకున్నారు.