కరీంనగర్ ఎమ్మెల్యేగానే పోటీచేస్తా..: బండి సంజయ్ క్లారిటీ
తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై బిజెపి సీనియర్ నాయకుడు , ఎంపీ బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. లోక్ సభ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే తాను కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే ఏం చేయాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అయితే బిజెపి అధిష్టానం తన పోటీపై ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి వుంటానని బండి సంజయ్ అన్నారు.
జమిలి ఎన్నికలంటే బీఆర్ఎస్ నేతలు భయపడిపోతున్నారని... నరేంద్ర మోదీ చరిష్మా ముందు నిలవలేమని వారికి అర్థమయ్యిందని సంజయ్ అన్నారు. జమిలీ ఎన్నికలొస్తే బిర్ఎస్ నేతలకు డిపాజిట్లు కూడా రావన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం ఇంకా ఆలోచన స్థితిలోనే వుందని... ఏ నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు. ఈ ఎన్నికలపై అధికారిక నిర్ణయం వెలువడకముందే తొందరపడి మాట్లాడటం మంచిది కాదన్నారు.
ఇక మంత్రి గంగుల కమలాకర్ తో బండి సంజయ్ కుమ్మక్కయ్యారన్న కాంగ్రెస్ నాయకుల ప్రచారంపైనా సంజయ్ స్పందించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల తప్పుడు సమాచారం ఇచ్చాడంటూ సంజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసాడు. అయితే ఇటీవల ఈ పిటిషన్ పై విచారణకు సంజయ్ హాజరుకాకపోవడంతో కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఇలా తనపై తప్పుడు సమాచారం చేస్తున్నవాళ్లంతా మూర్ఖులని సంజయ్ అన్నారు. ఈ పిటిషన్ విచారణను మూడుసార్లు వాయిదా కోరిన మాట వాస్తమేనని అన్నారు. అయితే ఓసారి పార్లమెంట్ సమావేశాలు, మరోసారి అమెరికాలో ఉన్నానని... ఇలా అందుబాటులో లేకపోవడం వల్లే వాయిదా కోరినట్లు సంజయ్ వెల్లడించారు.
Read More తప్పును తప్పు అంటే చంద్రబాబు ఏజెంట్ అంటారు..: వైసీపీపై బండి సంజయ్ సంచలనం
తెలంగాణ బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేయడంపై సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఎక్కడ నిరుద్యోగులకు చేసిన మోసాలు ఈ దీక్ష ద్వారా బయటపడతాయోననే కేసీఆర్ సర్కార్ భయపడిపోయిందన్నారు. తమ బండారం బయటపడకూడదనే కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసారన్నారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ వయసు పెంచి నిరుద్యోగులు పొట్టకొడుతున్నారని సంజయ్ అన్నారు. పదవీ విరమణ వయసు పెంపు కూడా ఉద్యోగుల కోసం చేసింది కాదని... రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వ ఖజానాలో సొమ్ము లేకపోవడం వలనే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. చివరకు ఉద్యోగులకు ప్రభుత్వ భూములను తెగనమ్మి జీతాలిచ్చే దుస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని 5.5 లక్షల కోట్ల అప్పుల ఊభిలోకి నెట్టి కేసీఆర్ చెల్లని రూపాయిలా మారారన్నారు.
సీఎం కేసీఆర్ కు బీజేపీ అంటేనే భయం పట్టుకుందని... అందువల్లే కాంగ్రెస్ ను జాకీ పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాడని సంజయ్ అన్నారు. ఇక కాంగ్రెస్ కూడా ఎలాగూ అధికారంలోకి వచ్చేదిలేదని తెలిసే అడ్డగోలు హామీలు ఇస్తుందన్నారు. కేంద్రాన్ని బదనాం చేసి కాంగ్రెస్ ఇమేజ్ పెంచడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నాడని బండి సంజయ్ ఆరోపించారు.