Asianet News TeluguAsianet News Telugu

'ధరణి'తో లక్షల ఎకరాలు మాయం.. కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ కూడా దూకుడు పెంచింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సోమవారం బీజేపీ బహిరంగ సభకు నిర్వహించగా.. ఈ సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

BJP leader and Union Home Minister Rajnath Singh criticises brs government in janagaon meeting KRJ
Author
First Published Oct 17, 2023, 4:20 AM IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సంసిద్దమవు తున్నాయి. వ్యూహాప్రతి వ్యూహాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా విమర్శ ప్రతి విమర్శ సర్వసాధారణంగా మారాయి. తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ .. బీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.  కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో చేసిన అభివృద్ధి శూన్యమని, తెలంగాణ ప్రజలు రెండుసార్లు సీఎం కేసీఆర్ కు అధికారం కట్టబెట్టినా ఏమీ చేయలేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సోమవారం నిర్వహించిన బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

'ధరణి'తో లక్షల ఎకరాలు మాయం

'ధరణి' పోర్టల్ అడ్డం పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం భూ కబ్జాలకు పాల్పడిందనీ, ఈ పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని లక్షల ఎకరాలు మాయం చేశారని రాజ్ నాథ్ సంచలన ఆరోపణలు చేశారు. అదే మోదీ తీసుకొచ్చిన 'భూ స్వామిత్ర' పథకంపై ప్రశంసలు గుప్పించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ భూ హక్కులు ఇచ్చామని, నిర్ణీత, ఖచ్చితత్వంగా ఉండేలా.. శాటిలైట్ ఆధారంగా హద్దులు నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో కల్వకుంట్ల మాత్రమే లాభపడిందని, వారి కుటుంబ అవినీతి ఢిల్లీ వరకూ చేరిందని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కరే పోరాడలేదని, యావత్తు తెలంగాణ పోరాడిందని రాజ్ నాథ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 'బీఆర్ఎస్ కారు.. బేజారు'అవుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ అధికారం లేకుండా కేసీఆర్ ఉండలేరని ఎద్దేవా చేశారు. ఈ సారి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు హ్యాండ్ ఇవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. కమలం పార్టీకి ఓటేస్తే.. అంతా మంచే జరుగుతుందని అన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పై కూడా విమర్శలు గుప్పించారు. అప్పట్లో కాంగ్రెస్ తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిందని, అయితే ఆ పార్టీ వైఫల్యంతోనే ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు నెలకొన్నాయని విమర్శించారు. బీజేపీ ఇచ్చిన 3 ప్రత్యేక రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని చెప్పారు.

 తెలంగాణలో అభివృద్ధి వేగవంతం కావాలంటే.. బీజేపీని గెలిపించాలని రాజ్ నాథ్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ హయాంలో పేదలకు నేరుగా లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు పీఎం ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించి ఇచ్చినట్లు చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మోదీదేనని అన్నారు. 27 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉందని, అభివృద్ధికి రోల్ మోడల్ గా నిలిచినట్లు చెప్పారు. పదేళ్లుగా తెలంగాణలో అభివృద్ధి ఎందుకు జరగలేదో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు.?. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలను రాజ్ నాథ్ కోరారు. ఈ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా ఇతర నేతలూ పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios