టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆరోపించారు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ .

ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ అభివృద్ధిపై దృష్టి సారించలేదని ఆరోపించారు. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్‌లో వరద, బురద పేరుకుపోయే పరిస్థితి నెలకొందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి సైతం అందించలేదని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్, ఎంఐఎం మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాయని లక్ష్మణ్ విమర్శించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కోవిడ్ కష్టకాలంలో ప్రజలను ప్రభుత్వం ఆదుకోలేదని ఆయన దుయ్యబట్టారు. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు కొమ్ముకాసి పేదలను దోచుకున్నారని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం కరోనా బాధితులకు ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5 లక్షలు ఇస్తామంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడిందని ఆయన వెల్లడించారు.

దుబ్బాకలో విజయం తర్వాత బీజేపీ మరింత దూసుకుపోతుందనే ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ముందుకు తీసుకొచ్చారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనేక ప్రలోభాలకు పాల్పడినట్లు లక్ష్మణ్‌ ఆరోపించారు. వరద సాయం పంపిణీలో పెద్దఎత్తున దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. అధికార పార్టీతో పోరాటం చేసి గ్రేటర్‌లో బీజేపీ విజయం సాధించిందని లక్ష్మణ్ చెప్పారు.