హైదరాబాద్: గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీకి జీహెచ్ఎంసీలో  ప్రాతినిథ్యం పెరిగే అవకాశం కన్పిస్తోంది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లోనే బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఈ దఫా మాత్రం ముప్పైకి పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది.

2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో ఈ రెండు పార్టీల అభ్యర్ధులు విజయం సాధించారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడ బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. బీజేపీ మాత్రం నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత నగరంలోని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు.

2020 జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. బల్దియాపై కాషాయ జెండాను ఎగురవేస్తామని ధీమాను కన్పించింది బీజేపీ.  ఈ దఫా ఒంటరిగానే బీజేపీ ఈ ఎన్నికల బరిలోకి దిగింది.ఈ ఎన్నికల్లో బీజేపీ మొదటి నుండి దూకుడుగానే వ్యవహరించింది. ఎంఐఎం, టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకొని బీజేపీ ప్రచారం నిర్వహించింది.

బీజేపీ, ఎంఐఎంల ల మధ్య కూడ మాటల యుద్దం సాగింది.  వీరిద్దరి ప్రచారంపై మంత్రి కేటీఆర్ ఒకానొకదశలో అసహనం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలకు చెందిన ఇద్దరిని పిచ్చోళ్లలుగా కేటీఆర్ అభివర్ణించారు.

పాతబస్తీ, ఎల్బీనగర్ , ముషీరాబాద్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఉప్పల్  నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు.గత ఎన్నికల్లో పాతబస్తీలో మూడు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్‌కేపురంలో బీజేపీ అభ్యర్ధి గెలుపొందారు.

also read:జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020: కాంగ్రెస్‌కు బీజేపీ దెబ్బ

ఈ దఫా పాతబస్తీతో పాటు ఇతర నియోజకవర్గాల్లో కూడ బీజేపీ పాగా వేసింది. ఎల్బీనగర్, మలక్‌పేట నియోజకవర్గాల్లో బీజేపీ తన సత్తాను చాటింది. ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్దుల కంటే బీజేపీ అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ స్థానాల్లో తాము పాగా వేస్తామని బీజేపీ నేతలు మొదటి నుండి ధీమాగా ఉన్నారు.  ఎన్నికల ఫలితాలు కూడా అదే రకంగా కన్పిస్తున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు చాలా కాలం నుండి బీజేపీ గ్రౌండ్ వర్క్ చేసుకొంది. బీజేపీ అగ్రనేతలు ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు.టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమనే విషయాన్ని బీజేపీ ప్రధానంగా ప్రచారం చేసింది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అదే దూకుడును కొనసాగించింది.

టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును బీజేపీ తన వైపునుక తిప్పుకోవడంలో విజయవంతమైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తన వైపుకు తిప్పుకొంది. ఈ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపునకు వెళ్లకుండా బీజేపీ వ్యూహం కలిసి వచ్చింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడ బీజేపీ వైపునకు మళ్లిందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ 45 స్థానాల్లో విజయం సాధించింది. 2016 ఎన్నికల్లో టీడీపీ ఒక్క స్థానానికే పరిమితమైంది. ఈ దఫా ఆ పార్టీ ఖాతా తెరిచే పరిస్థితి లేకుండా పోయింది. టీడీపీ ఓటు బ్యాంకును అన్ని పార్టీలు షేర్ చేసుకొన్నాయి. అయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కైవసం చేసుకొన్న సీట్లలో ఈ దఫా కొన్ని తగ్గే అవకాశం కన్పిస్తోంది. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొంటామని బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు. ఈ వ్యూహాంతోనే బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు.