పదవ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకు కావడంపై డీకే అరుణ స్పందిస్తూ తనదైన శైలిలో ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలన మొత్తం కుప్పకూలిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న వేళ వాట్సాప్‌లో ప్రశ్నపత్రాలు రావడం సంచలనంగా మారింది. నిన్న వికారాబాద్ లో తెలుగు ప్రశ్నపత్రం లీక్ కాగా.. నేడు వరంగల్‌లో హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో వైరలైంది. ఈ ఘటనపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో పరిపాలన మొత్తం కుప్ప కూలిపోయిందని విమర్శలు గుప్పించారు. మంగళవారం పదవ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకు కావడంపై డీకే అరుణ స్పందిస్తూ తనదైన శైలిలో ప్రభుత్వాని ఏకీ పారేశారు.ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేసారు. 

మొన్న టీఎస్పీఎస్సీ, నిన్న పదవ తరగతి తెలుగు, నేడు పదవ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకు అవుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు పైన వాన పడ్డట్టుగా ఉందని విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వంలో ఎవరు? ఏ శాఖ మంత్రో కూడా అర్థం కావడం లేదని, అన్ని శాఖలకు తానే రాజు.. తానే మంత్రిగా ముఖ్యమంత్రి, సీఎం కుమారుడు కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో విద్యావ్యవస్థను నిర్వీహం చేస్తున్నారనీ, వరుసగా ప్రశ్నపత్రాలు లీకులు అయితుంటే.. ప్రభుత్వం తరుఫున ఎవరూ స్పందించడం లేదని డీకే అరుణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు ప్రభుత్వ అధికారులు తమ పదవులపై పట్టు కోల్పోయారని విమర్శలు గుప్పించారు. సీఎం కెసిఆర్ కు కేవలం స్కీములు పేర్లు చెప్పాలే స్వాములు చేయాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు.

, అదే విధంగా తమ బిడ్డ పై ఉన్న ప్రేమలో, కనీసం పది శాతమైన తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధిపై ఉంటే.. బాగుండేదని డీకే అరుణ అన్నారు. లీకేజి వ్యవహారంపై సీఎం కేసీఆర్ స్పందించి, నిందితులను సరైన విధంగా విచారించాలనీ, ఈ లీకుల వెనుక ఉన్న అసలు సూత్రదారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేసారు.

ఈ ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. ప్రశ్నపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైన ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. క్వశ్చన్ పేపర్ ఎక్కడి నుంచి బయటకు వచ్చిందనే దానిపై విచారణ జరుపుతున్నామని హామీ ఇచ్చారు. బయటకు వచ్చిన పేపర్ ఈరోజు కన్ఫర్మ్ అవుతుందని చెప్పారు. అయితే.. పేపర్ సీరియల్ నంబర్ కనిపించకుండా ఫొటో తీశారని తెలిపారు. అసలు ప్రశ్నప్రతం ఎక్కడి నుంచి లీకైందో విచారణలో తెలుస్తుందన్నారు. అయితే ఇది లీకేజీ కాదని, పేపర్ బయటికి వచ్చిందన్నారు. సగం పరీక్ష ముగిశాక పేపర్ బయటకు వచ్చిందన్నారు.