ఈ నెల 27న వరంగల్ సభ యథాతథం: బీజేపీ
ఈ నెల 27న వరంగల్ లో సభను నిర్వహించి తీరాలని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపును పురస్కరించుకొని ఈ సభను ఏర్పాటు చేశారు. అయితే ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు ఈ యాత్రను నిలిపివేయాలని కూడా పోలీసులు నిన్ననే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత యాత్ర ముగింపును పురస్కరించుకొని ఈ నెల 27వ తేదీన వరంగల్ లో సభను నిర్వహించి తీరుతామని బీజేపీ నేతలు తేల్చి చెబుతున్నారు.
నిన్నటి నుండి బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న బండి సంజయ్ పాదయాత్ర శిబిరం నుండి నిన్న ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్ లోని ఆయన ఇంటిలో దిగబెట్టారు. ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధలోని వర్ధన్నపేట ఏసీపీ బండి సంజయ్ కు నిన్న నోటీసులు పంపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో యాత్రకు అనుమతి లేదని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. వెంటనే యాత్రను నిలిపివేయాలని కోరారు. అయితే యాత్రను కోనసాగించి తీరుతామని బండి సంజయ్ నిన్ననే ప్రకటించారు. వర్ధన్నపేట ఏసీపీ ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టులో బీజేపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో విచారణ సాగనుంది.హైకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతిని ఇస్తే అవసరమైన పక్షంలో రూట్ మ్యాప్ ను మార్చుకోవాలని కూడా బీజేపీ భావిస్తుంది. ప్రజా సంగ్రామ యాత్రను ఆపేది లేదని కూడా బీజేపీ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్మాం విషయంలో టీఆర్ఎస్ నేతల పేర్లు బయటకు వచ్చినందున ఈ విషయమై ప్రజల దృష్టిని మరల్చేందుకు యాత్రను నిలిపివేశారని బండి సంజయ్ ఆరోపించారు. అంతేకాదు తెలంగాణలో మత ఘర్షణలు సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రయత్నాలు చేస్తుందని ఆయన ఆరోపించారు.
also read:ప్రజా సంగ్రామ యాత్రలో ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు.. కుంటిసాకులతో ఆపేందుకు కుట్ర: బండి సంజయ్
పాదయాత్ర ఈ నెల 27వ తేదీ నాటికి వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకోవాలి. అదే రోజున వరంగల్ లో బహిరంగ సభను నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది.ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరు కానున్నారు.ఈ సభను ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది.
ఇదిలా ఉంటే ప్రజా సంగ్రామ యాత్రలో తాను విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేయలేదని కూడా బండి సంజయ్ చెప్పారు. రెండు దఫాలు నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రకు లేని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు వచ్చాయని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంపై ప్రజల్లో ప్రచారం చేస్తామనే భయంతో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేకుండా చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.