హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్ కేబినెట్ నుండి తొలగింపు, పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా ప్రకటన ఇలా తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారిన వేళ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయంటూ సంచలన ప్రకటన చేశారు. 

గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులకు బిజెపి మాత్రమే వేదిక అవుతోందన్నారు. ఇతర పార్టీల నుండి కొందరు ముఖ్యమైన నేతలు కూడా బిజెపిలోకి రావడానికి సిద్దంగా వున్నారంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

read more  బీజేపీలోకి ఈటల.. ఈ నెల 14న ముహూర్తం, నడ్డా సమక్షంలో కాషాయ కండువా

రాష్ట్రంలో సామాన్య ప్రజలకే కాదు మంత్రి స్థాయి వ్యక్తికి కూడా రక్షణ లేకుండా పోయిందని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ పార్టీని వీడే పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించారని అన్నారు. చుట్టూ వుండే భజనపరులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని... నచ్చనివారిపై అవినీతి ఆరోపణలు చేస్తూ నిర్దాక్షిణ్యంగా పార్టీనుండి బయటకు వెళ్లేలా చేస్తున్నారని సంజయ్ పేర్కొన్నారు. 

ఇప్పటికే ఈటల రాజేందర్ బీజేపీలో చేరేలా ఒప్పించడంలో సంజయ్ కీలకపాత్ర పోషించారు. ఢిల్లీలోని పార్టీ పెద్దలతో మాట్లాడిన సంజయ్... ఉద్యమకారులను కాపాడుకోవాలని పార్టీ పెద్దలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే ఈటల చేరికపై రాష్ట్ర నేతల అభిప్రాయాలను కూడా ఆయనే సేకరించారు. ఈ క్రమంలోనే ఈటలను బీజేపీలో చేర్చుకోవాలని సంజయ్‌కు పార్టీ నేతలు సూచించినట్లు... ఈ విషయాన్ని కూడా పార్టీ పెద్దలకు ఆయనే చేరవేసారు.