Asianet News TeluguAsianet News Telugu

ప్రత్యేక రాష్ట్ర లక్ష్యం నెరవేరలేదు.. తెలంగాణపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చ

హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణపై ప్రకటన విడుదల చేసింది బీజేపీ. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదని.. నీళ్లు, నిధులు, నియామకాలు జరగలేదని ప్రకటన విడుదల చేసింది. 

bjp announcement on telangana at party national executive meeting
Author
Hyderabad, First Published Jul 3, 2022, 4:25 PM IST

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో (bjp national executive meeting) తెలంగాణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణపై ప్రకటన విడుదల చేసింది బీజేపీ. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదని.. నీళ్లు, నిధులు, నియామకాలు జరగలేదని ప్రకటన విడుదల చేసింది

మరోవైపు ... తెలంగాణ కోసం చాలా మంది త్యాగాలు చేశారని.. ప్రజలు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటై ఆంకాక్షలు నెరవేరతాయని యువతరం భావించిందన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా  తెలంగాణ అంశంపై చర్చించారు. అనంతరం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో (kishan reddy) కలిసి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇప్పటికీ నెరవెరలేదన్నారు. 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. 

Also Read:బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు: తెలంగాణ వంటకాలను పరిశీలించిన ప్రధాని మోడీ

తెలంగాణ ప్రజల కష్టాలు పెరుగుతున్నాయని అన్నారు. తెలంగాణలో రైతులు, యువకులు , దళితులు అందరూ కష్టాల్లో ఉన్నారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎవరైతే పోరాడారో వారు నేడు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. నీళ్లు, నిధులు, నియమాకాలు.. నినాదంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగిందని గుర్తుచేశారు. కానీ తెలంగాణలో ఇప్పటికీ నిరుద్యోగ సమస్య ఉందన్నారు. 

8 ఏళ్లుగా కేంద్రం తెలంగాణకు ఎన్నో నిధులు ఇచ్చిందని పీయూష్ గోయల్ చెప్పారు. కేంద్రం నిధులను తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 40 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పెంచారని చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని చెప్పారు. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సొంతం చేసుకుందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు.  తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేసేందుకు బీజేపీ నాయకత్వం కృషి చేస్తుందన్నారు. 

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని విమర్శించారు. బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై భారీగా జరిమానాలు వేశారని అన్నారు. టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. తెలంగాణలో రెండు రోజులుగా ఏం జరుగుతుందో అంతా చూశారని చెప్పారు. తమ సమావేశాలకు కౌంటర్ ఇవ్వాలని ఎన్ని డబ్బులు ఖర్చు చేస్తుందో మీరంతా చూశారని అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ స్టీరింగ్ అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉందని ఆరోపించారు. ప్రగతి భవన్‌లోకి మంత్రులు ఎవరికీ ప్రవేశం లేదని అన్నారు. కానీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం బైక్ వేసుకుని సీఎం వద్దకు నేరుగా వెళ్తారని విమర్శించారు.. నెలలో 20 రోజులు సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే ఉంటున్నారని అన్నారు. 

కేసీఆర్ ఆరేళ్లుగా సచివాలయానికి ఒక్క రోజు కూడా సీఎం రాలేదని విమర్శించారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. ఒవైసీ, కేసీఆర్ కలిసి తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి సీఎం నుంచి బీజేపీ ఏం నేర్చుకోవాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్నది తండ్రి, కొడుకుల నిరంకుశ సర్కార్ అని విమర్శించారు. కుటుంబ పాలన, అవినీతి పాలన ఎలా చేయాలో టీఆర్ఎస్‌ను చూసి నేర్చుకోమంటారా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రశ్నలకు తాము జవాబు ఇవ్వమని.. తెలంగాణ ప్రజలకు తాము జవాబుదారీ అని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios